Thursday, May 2, 2024

అగ్నిప‌థ్ నిరసనల నేపథ్యంలో నిఘాపెంపు.. హైద‌రాబాద్‌లో ప్రధాని వెూడీ బస మార్పు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. రెండు రోజులపాటు ఇక్కడి హెచ్‌ఐసీసీలో జరగనున్న బాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని హాజరవుతున్నారు. జులై 2వ తేదీ మధ్యాహ్నం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్‌ వస్తారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం బేగంపేట విమానాశ్రయంలో దిగాక అక్కడి నుంచి సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ చేరుకుని అక్కడి ప్రత్యేక అతిథి గృహంలో బస చేయాలని సంకల్పించారు. అయితే అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ వివిధ రాజకీయ పక్షాలు, సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని రాజ్‌భవన్‌లో బస చేయడం శ్రేయస్కరం కాదని హైదరాబాద్‌ నగర పోలీసులు ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు (ఎస్‌పీజీ) ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిసింది. దీంతో ప్రధాని మోడీ రాజ్‌భవన్‌లో కాకుండా హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లోనే బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ప్రముఖుల రాక…

జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ, బాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు ఇతర కేంద్ర మంత్రు లు, ఉత్తర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌, ఇతర బాజపా రాష్ట్రాల ముఖ్యమ ంత్రులు హాజరవుతున్న సంగతి తెలిసిందే. భద్రతా పరంగా అవసరమైన అన్ని చర్యలను హైదరాబాద్‌ నగర పోలీసులు తీసుకుంటున్నారు. ప్రముఖులంతా నగరంలో కాలు మోపినప్పటి నుంచి తిరిగి గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లే వరకు పోలీస్‌ శాఖకు భద్రత సవాల్‌గా మారింది. అందుకే ప్రతి అంశాన్ని కూలంకశంగా చర్చిస్తున్నారు. ప్రముఖులు వస్తున్నందున హైటెక్‌సిటీ ప్రాంతంలోని ప్రధాన హోటళ్లలో పని చేసే సిబ్బంది సమా చారాన్నంతా సేకరిస్తున్నారు. కాగా ప్రధాని భద్రతా ఏర్పాట్లను పర్య వేక్షించేందుకు ఎస్‌పీజీ ఉన్నతాధికారుల ప్రత్యేక బృందం ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుంది.

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు విజయ సంకల్ప సభగా నామకరణం చేశారు. రాష్ట్రంలో బాజపా విధానాన్ని ప్రకటించడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్లు బాజపా నేతలు చెబుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పది లక్షల మందిని ఈ బహిరంగ సభకు పంపించేలా బాజపా ఏర్పాట్లు చేస్తోంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌ నుంచి పది మంది పార్టీ కార్యకర్తలు ఈ బహిరంగ సభకు తరలిరావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే పిలుపునిచ్చారు. కార్యకర్తలు, ప్రజలు బహిరంగ సభకు స్వచ్చందంగా తరలిరావాలని కోరుతున్నారు. బహిరంగ సభకు సంబంధించిన సభా వేదిక ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. 2వ తేదీ సాయంత్రంకల్లా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని అదే రోజు సభా వేదికను ఎస్‌పీజీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారని సమాచారం.

భారీ బందోబస్తు ..

- Advertisement -

ప్రధాని హైదరాబాద్‌ పర్యటన దృష్ట్యా రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానితో పాటు 40 మంది పార్టీ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దాదాపు 450 మంది పార్టీ నేతలు జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్నందున వారి భద్రతను సవాల్‌గా తీసుకుని పని చేస్తున్నారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ పోలీస్‌ శాఖ నిమగ్నమై ఉంది. తీవ్రవాదులు, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉన్నందున గతంలో తీవ్రవాదాన్ని అణచివేయడంలో పని చేసిన పోలీసు అధికారులను గుర్తించి వారిని ప్రధాని బందోబస్తుకు పిలిపించాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది. రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలకు, మూడవ తేదీన జరిగే బహిరంగ సభకు పదివేల మంది పోలీసులను బందోబస్తు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement