Saturday, May 4, 2024

Bilkis accusers: లొంగిపోతాం…కాస్త గ‌డువు పెంచండి – బిల్కిస్ నిందితులు మొర

బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ ముగ్గురు దోషులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

దోషులలో ఒకరైన గోవింద్‌భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్‌లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు.
కేసు వివ‌రాల‌లోకి వెళితే ….
2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం చోటు జరిగింది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement