Saturday, May 4, 2024

గర్భస్థ శిశువుకు శస్త్రచికిత్స! వైద్యరంగ చరిత్రలో ఇదే తొలిసారి

తల్లిగర్భంలో ఉన్న శిశువుకు వైద్యులు మెదడు సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేయడం సంచలనం రేపింది. వైద్యరంగ చరిత్రలో ఈ తరహా ఆపరేషన్‌ చేయడం ఇదే తొలిసారిగా ఆ వైద్యులు చెబుతున్నారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ పరిణామం దోహదం చేస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు. తల్లి గర్భకోశంలో 32 వారాల వయస్సున్న శిశువుకు మెదడులో రక్తం సరఫరాకు సంబంధించిన సమస్యను గుర్తించిన వైద్యబృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఆ వివరాలతో కూడిన వ్యాసాన్ని ప్రఖ్యాత జర్నల్‌ ‘స్ట్రోక్‌’ ప్రచురించింది. బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్యబృందంలోని రేడియాలజిస్ట్‌ డా.డారెన్‌ ఓర్బాక్‌ ఆ విశేషాలను వెల్లడించారు.

ఓ గర్భిణికి నెలలు నిండుతున్న నేపథ్యంలో నెలవారీ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు గర్భస్థ శిశువు గుండె సాధారణ పరిమాణంకన్నా వ్యాకోచించి ఉందని గుర్తించారు. ఆ సమస్యను వైద్య పరిభాషలో వీఓజీఎం – వీన్‌ ఆఫ్‌ గాలెన్‌ మాల్‌ఫార్మేషన్‌గా పిలుస్తారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు కేశనాళికలకు బదులు నేరుగా సిరలకు (చెడురక్తాన్ని తీసుకువెళ్లే) అనుసంధానమవడాన్ని వీఓజీఎంగా చెబుతారు. దీనివల్ల మెదడుకు రక్తం సరఫరా మందగిస్తుంది. ఫలితంగా గుండె అప్రమత్తమై ఎక్కువ రక్తాన్ని సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఫలితంగా అటు ఊపిరితిత్తులు, గుండెపైనా ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండె వ్యాకోచించడం, గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది.

- Advertisement -

ఈ సమస్య ఉన్న గర్భస్థ శిశువుల్లో 40 శాతం మంది మరణించడం, 60-70 శాతం మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడటం సాధారణంగా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో గర్భిణి కెన్యాట్టా కోల్‌మన్‌, ఆమె భర్త, కటుంబ సభ్యులకు సమస్యను వివరించిన వైద్యబృందం శస్త్రచికిత్స చేస్తే సత్ఫలితం ఉంటుందని భరోసా ఇచ్చారు. గర్భస్థ శిశువుకు 34 వారాల వయస్సు వచ్చాక ఆల్ట్రాసౌండ్‌ విధానంతో వైద్యబృందం ఆపరేషన్‌ చేసింది. మెదడుకు మంచిరక్తాన్ని తీసుకువెళ్లే ధమనులు సిరలకు కాకుండా కేశనాళికలతో అనుసంధానమయ్యేలా సరిచేశారు. ఆ తరువాత కొద్ది గంటల్లో ఆ తల్లి ప్రసవించడం, నవజాత శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు ఎంఆర్‌ఐ సహా ఇతర పరీక్షల్లో తేలడంతో అందరూ ఆనందభరితులయ్యారు.

ప్రస్తుతం మూడు వారాల వయస్సున్న ఆ నవజాత శిశువుకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఎటువంటి వైద్యపరికరాల సాయమూ అవసరం లేకపోయిందని వైద్యబృందం వెల్లడించింది. తల్లిగర్భంలో ఉండగానే శస్త్రచికిత్స చేయడంవల్ల ఎటువంటి సమస్యలు ఉండవని తేలిందని, తల్లి ప్రసవించేవరకు నిరీక్షిస్తే, ఈ లోగా శిశువు మరణించడం లేదా శారీరక వైకల్యంతో ఉండే అవకాశాలున్నాయని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ తరహా ఆపరేషన్‌ విజయవంతం కావడం వైద్యచరిత్రలో మేలైన పరిణామమని వైద్యబృందం అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement