Saturday, April 27, 2024

Follow Up | సూపర్‌ సక్సెస్‌.. జీఎస్‌ఎల్‌వీ-ఎప్‌ 12 ప్రయోగం విజయవంతం

నాయుడుపేట (శ్రీహరికోట), ప్రభన్యూస్‌ : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌12 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. పూర్తి స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థను పటిష్ట పరిచే ఎన్‌వీఎస్‌ -01 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌12 నింగిలోకి ప్రవేశ పెట్టి ఇస్రో నమ్మకాన్ని నిజం చేసింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ ఇందుకు వేదికగా మారింది. సోమవారం ఉదయం 10.42గంటలకు షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌12 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ దేశాలకు మరోసారి సత్తా చాటింది. నావిగేషన్‌ వ్యవస్థను బలపరిచే విధంగా ఇస్రో రూపొందించిన 2232 కిలోల ఎన్‌విఎస్‌ -01 ఉపగ్రహాన్ని భూధృవ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థను బలపరిచేలా ప్రస్తుతం 8 ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి ఉంది. దేశ సరిహద్దులో 1500 కిలోమీటర్ల మేర నావిక్‌ కవరేజ్‌ ఉండే విధంగా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. వీటిలో నాలుగు ఉపగ్రహాలకు కాలం చెల్లడంతో వాటి స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఎన్‌వీఎస్‌ -01 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఎన్‌వీఎస్‌ – 01 ఉపగ్రహం ద్వారా మొబైల్‌ ఫోన్లలో వాడుతున్న జీపీఎస్‌ తరహాలో నావిగేషన్‌ ఉపగ్రహం సేవలు అందిస్తుంది. దీంతో పాటుగా భూగోళ, సముద్ర మార్గాలలో దారి చూపడానికి, వైమానిక ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది.

- Advertisement -

వ్యవసాయ రంగానికి, వివమానాల సర్వీసులకు, అత్యవసర ప్రయోజనాలకు, సముద్రంలో మత్య్స సంపదను గుర్తించడానికి, వివిధ ప్రభుత్వ శాఖల ప్రయోజనాల కోసం ఈ ఉపగ్రహం ఎంతగానో ఉపయోగపడనుంది. 12 ఏళ్ల పాటు పనిచేసేలా ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ఆదివారం ఉదయం 7.12గంటలకు ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాధ్‌ సారథ్యంలో ప్రారంభించారు. సోమవారం ఉదయం 10.42గంటలకు కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ నింగిలోకి నారింజ రంగు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

రాకెట్‌ గమనం ఇలా..

శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం (షార్‌)లోని రెండవ ప్రయోగ వేదికపై సిద్దంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌12 రాకెట్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్‌ సోమవారం ఉదయం 10.42 గంటలకు 0కు చేరుకున్న వెంటనే మూడు దశల జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌12 రాకెట్‌ తన గమనాన్ని ప్రారంభించింది. మొదటి దశ 2.28 సెకన్ల పాటు కొనసాగింది. అనంతరం రెండవ దశ ప్రారంభమైంది. 4.91 నిమిషాల పాటు సాగిన రెండవ దశ పూర్తె రాకెట్‌ను విడిపోయింది. అనంతరం మూడవ దశ ఆరంభమైంది. ఈ క్రమంలో రాకెట్‌ అగ్రభాగాన అమర్చిన ఉష్ణకవచం విడిపోయింది. 18.45 నిమిషాల వ్యవధిలో భూమికి 251 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌12 అగ్రభాగన ఉన్న ఎన్‌వీఎస్‌ -01 నావిగేషన్‌ ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం విజయవ ంతమైంది.

శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌

జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌12 రాకెట్‌ విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలను చేరవేయడంతో మిషన్‌ కంట్రోల్‌ సెంట్రల్‌లో ఇస్రో చైర్మన్‌ ఎం సోమనాధ్‌తో పాటు శాస్త్రవేత్తలు ఆనందోత్సాహల నడుమ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ ఎం సోమనాధ్‌ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలను ప్రత్యేకించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌12 రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినట్లు తెలియజేశారు.

ఈ ప్రయోగంలో క్రయోజనిక్‌ స్టేజి కీలకమైనదని గతంలో ఈ స్టేజిలో తలెత్తిన సమస్యలను అధికమించే విధంగా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయమన్నారు. దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ కోసం మరో నాలుగు ఉపగ్రహాలను పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. వాతావరణ పరిశోధన కోసం ఒక ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా చంద్రయాన్‌ -3 ప్రయోగానికి సిద్దమవుతున్నామన్నారు. మానవ రహిత ప్రయోగానికి ఇస్రో సిద్దమవుతున్నట్లు తెలిపారు. చిన్న ఉపగ్రహాల కోసం తమిళనాడులోని కులశేఖర్‌పట్నంలో ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. భూ సేకరణ పూర్తి కావాల్సి ఉందని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement