Thursday, April 25, 2024

Delhi | చట్టం చేసే వరకు పోరాటం.. జంతర్ మంతర్ వేదికగా కవిత అల్టిమేటం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి పాస్ చేసే వరకు పోరాడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బిల్లు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆమె ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ల బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టిన కవిత.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేతుల మీదుగా కవిత దీక్షను ప్రారంభించగా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీక్షావేదికపై కవితతో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహిళా ఎంపీ కవిత, పార్టీకి చెందిన ఇతర మహిళా నేతలు కూర్చున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు సైతం కవితతో పాటు దీక్షలో కూర్చోగా, మరికొందరు నేతలు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), వెంకటేశ్ నేత, వేణుగోపాల చారి తదితరులు వేదిక ఎదురుగా కూర్చుని సంఘీభావం తెలిపారు.

ఈ కార్యక్రమంలో 18 రాజకీయ పార్టీల నేతలు, వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా దీక్ష ప్రారంభం, ముగింపు సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల కోసం రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు మద్దతు పలకాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అనేక దేశాల్లో మహిళల భాగస్వామ్యంతో ప్రగతి పథంలో నడుస్తున్నాయని తెలిపారు. మన దేశం కూడా అభివృద్ధిలో ముందుకు సాగాలంటే రాజకీయ రంగంలో మహిళలకు గణనీయమైన ప్రాతినిధ్యం అవసరమని స్పష్టం చేశారు. అందుకు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం రావాలని స్పష్టం చేశారు.

- Advertisement -

మహిళా రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగులో ఉందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి సహకరించిన ఆయా రాజకీయ పార్టీలు, నేతలకు సలాం చెబుతున్నానని అన్నారు. అనేక పోరాటాల నేపథ్యంలో 1996లో తొలిసారి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారని, 2017 ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది అని గుర్తు చేశారు. పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశ పెట్టడానికి పోరాటాలు కృషి చేసిన బృందాకారత్, సోనియాగాంధీ, జయంతి నటరాజన్, సుష్మ స్వరాజ్ తో పాటు ఆయా మహిళా సంఘాలకు ధన్యవాదాలు తెలియజేశారు. తన నిరాహార దీక్షకు హాజరయ్యి మద్దతు పలికిన ఆయా రాజకీయ పార్టీలకు కవిత కృతజ్ఞతలు తెలియజేశారు.

మహిళలకు రిజర్వేషన్లతో దేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు చారిత్రక అవసరమని తెలిపారు. పూర్తి మెజారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడితే మద్దతు ఇవ్వడానికి అనేక పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, తాము కూడా మద్దతు ఇస్తామని ప్రకటించారు. పూర్తి మెజారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే రెండు గంటల్లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అన్నారు. ఈ నిరాహార దీక్ష ఆరంభం మాత్రమేనని, ఇకపై ఈ అంశం మీద దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పై వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. మహిళా రిజర్వేషన్ల అంశం తనకు మాత్రమే సంబంధించింది కాదని, ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, ఇది దేశానికి సంబంధించిన అంశమని కవిత స్పష్టం చేశారు.

మహిళల భాగస్వామ్యం లేనిది దేశం ఎలా ముందుకు వెళుతుందని ప్రశ్నించారు. ఇది రాజకీయ అంశం కానే కాదని అన్నారు. 1992లో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారని, ఫలితంగా ఈరోజు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళా ప్రాతినిధ్యం ఉందని వివరించారు. కాబట్టి ఇప్పుడు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తే 10 – 20 ఏళ్ల తర్వాత పార్లమెంటు, అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం 50 శాతానికి పైగా పెరుగుతుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన నిరాహార దీక్షకు వచ్చిన మహిళల సంతకాలను సేకరించామని, సంతకాలతో కూడిన లేఖను ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి పంపిస్తామని వెల్లడించారు.

జంతర్ మంతర్ వద్ద ఉదయం గం. 10.00 నుంచి సాయంత్రం గం. 4.00 వరకు జరిగిన ఈ దీక్షలో బీఆర్ఎస్ నేతలతో పాటు నాడు మహిళా బిల్లును వ్యతిరేకించిన సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఆ పార్టీ మహిళా నేత పూజ శుక్లా హాజరయ్యారు. ఈ బిల్లుకు సమాజ్‌వాదీ పూర్తిగా మద్ధతు ప్రకటిస్తోందని వెల్లడించారు. అలాగే నాడు వ్యతిరేకించిన పార్టీలో ఆర్జేడీ కూడా ఉంది. ఆ పార్టీ తరఫున బిహార్ మాజీ మంత్రి శ్యాం రజక్ హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్రీయ లోక్‌దళ్, పీడీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎంపీ సంజయ్ సింగ్), సీపీఐ (నారాయణ), సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి, శివసేన పార్టీల నేతలతో పాటు భారతీయ కిసాన్ యూనియన్ నేతలు, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు, పంజాబ్, హర్యానా యువజన సంఘాలు, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్, తమిళనాడు, కేరళ రైతు సంఘాలు, సింగరేణి కోల్ మైనర్స్ అసోసియేషన్ సహా మహిళా సంఘాలు, మహిళా హక్కుల సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మహిళా బిల్లు అవసరం – సీతారం ఏమారి, సీపీఐ (ఎం), జాతీయ ప్రధాన కార్యదర్శి
కవిత ముఖ్యమైన అంశంపై కదంతొక్కారు. రాజకీయ రంగంలో మహిళా రిజర్వేషన్లు చాలా అవసరం. మహిళా బిల్లు ఆమోదం పొందేవరకు ఈ పోరాటంలో మా పార్టీ పాల్గొంటుదని హామీ ఇస్తున్న సుమారు 3 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సమానత్వం రాదో అప్పటి వరకు అభివృద్ధి జరగదు. మహిళా భాగస్వామ్యం లేని ఏ దేశంలోనూ ఆర్థికంగా పురోగతి సాధించలేదు. అనేక పోరాటాల తర్వాత రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాన మంత్రి అయినప్పుడు ఈ హామీ ఇచ్చారు. 9 ఏళ్లు గడిచినా ఇప్పటికీ బిల్లు తీసుకురాలేదు. ఈ విషయంలో భారత్ జాగృతి. భారత్ రాష్ట్ర సమితితో కలిసి నడుస్తాము. పూర్తి మద్దతు ఇస్తాము. పంచాయతీ స్థాయిలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు పార్లమెంటు, అసెంబ్లీల్లో ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేరు?

లాలూ మద్ధతు – శ్యాం రజాక్, బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ
మహిళా రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తున్న దేశ మహిళల తరపున ధన్యవాదాలు చెబుతున్నాను. మా పార్టీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చారు. మహిళాలకు రిజర్వేషన్ కల్పించనంత కాలం దేశ రాజ్యాంగానికి రక్షణ ఉండదు. మహిళా రిజర్వేషన్లలోనూ దళితులు, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిం చాలి. బిహార్ జిల్లా పరిషత్, పంచాయతీల్లో దళిత, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాము. అక్కడ చేసినప్పుడు చట్టసభల్లో ఎందుకు చేయలేము భారతీయ సంస్కృతిలో మహిళలకు ఉన్నత స్థానం ఉంది. మహిళలకు రిజర్వేషన్లు కల్పించకుండా భారతీయ సంస్కృతిని కాపాడలేము. బీజేపీ పార్టీ అబద్దాలు చెబుతోంది. గోబెల్స్ ప్రచారం చేస్తోంది. కవితకు అండగా ఉంటాము. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లును తీసుకురావాలి. బిల్లుకు మా పార్టీ మద్దతిస్తుంది కవిత నేతృత్వంలో జరుగుతున్న పోరాటానికి అండగా ఉంటాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement