Monday, May 6, 2024

ఐదేళ్ల కనిష్టానికి ఆహారధాన్యాల నిల్వలు.. ఎఫ్‌సిఐ గోదాముల్లో తగ్గిన స్టాక్‌

ఒకవైపు సెప్టెంబర్‌లో రిటైల్‌ తృణధాన్యాల ధరల ద్రవ్యోల్బణం 105 నెలల గరిష్ట స్థాయికి ఎగబాకాయి. అదే సమయంలో ఇంకొకవైపు ప్రభుత్వ సంస్థల వద్ద గోధుమలు, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నివేదిక ప్రకారం, అక్టోబర్‌ 1 నాటికి పబ్లిక్‌ గోదాముల్లో గోధుమ, బియ్యం నిల్వలు మొత్తం 511.4 లక్షల టన్నులు ఉన్నాయి. గతేడాది ఈ నిల్వల పరిమాణం 816 లక్షల టన్నులుగా ఉండేది. 2017 తర్వాత ఇదే కనిష్ట నిల్వల పరిమాణం కావడం గమనార్హం. అక్టోబర్‌1 నాటికి గోధుమ నిల్వలు 227.5 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఇది ఆరేళ్ల కనిష్టస్థాయి. అయినప్పటికీ 205.2 లక్షల టన్నుల బఫర్‌ (మూడు నెలల ఆపరేషనల్‌ స్టాక్‌) కంటే ఎక్కువే. అదే సమయంలో బియ్యం నిల్వలు అవసరమైన దానికంటే 2.8 రెట్లు అధికంగా ఉన్నాయి.

ఐదేళ్ల నాటి నిల్వలతో పోల్చితే గిడ్డంగుల్లో ఆహార ధాన్యాలు తగ్గినప్పటికీ, తృణధాన్యాల స్టాక్‌ సాపేక్షంగా సౌకర్యవంతంగా ఉంది. తృణధాన్యాలు, ఉత్పత్తుల ధరల సూచీ ఈ ఏడాది 115.3శాతం పెరిగినట్లు చూపిస్తున్నప్పటికీ, స్టాక్‌లు తగ్గుతున్నట్లు స్పష్టమవుతున్నది. ఎఫ్‌సీఐ గోధుమ స్టాక్‌లలో తగ్గుదల ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, నాన్‌ పీడీఎస్‌ గోధుమలు, ఆటా పిండికి సంబంధించిన వార్షిక రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 15.72 శాతంగా ఉన్నది. అంతర్జాతీయంగా ధరల అనిశ్చితి పెరుగుతున్నది. చికాగొ బోర్డు ఆఫ్‌ ట్రేడ్‌ ఎక్స్చేంజిలో బెంచ్‌ మార్కు గోధుమ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధరలు మార్చి 7న రికార్డు స్థాయిలో 12.94 డాలర్ల నుంచి ఆగస్టు 18న 7.49డాలర్లకు పడిపోయాయి. కానీ ఉక్రెయిన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల తో ధరలు మళ్లి పెరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement