Tuesday, April 30, 2024

Delhi | రాష్ట్రాలకు ఆ అధికారం లేదు.. విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు వేయొద్దన్న కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు వేసే అధికారం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ ఓ లేఖ రాసింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు, సుంకాలు విధిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. విద్యుత్ ఉత్పత్తి (థర్మల్, హైడ్రో, విండ్, సోలార్, న్యూక్లియర్) ఏ రకంగా చేసినప్పటికీ దానిపై పన్నులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

రాష్ట్రాలు ఏయే అంశాలపై పన్నులు విధించవచ్చో రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పొందుపరిచి ఉందని, అందులో పేర్కొన్న జాబితాలో లేని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రూపంలోనూ పన్నులు విధించడం కుదరదని తేల్చి చెప్పింది. 7వ షెడ్యూల్‌లోని జాబితాలో లేని ఏ అంశమైనా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకే వస్తుందని రాజ్యాంగం చెబుతోందని వెల్లడించింది. లిస్ట్-2లో ఎంట్రీ 53 ప్రకారం ఆయా రాష్ట్రాల పరిధిలో విద్యుత్ వినియోగం, అమ్మకంపై మాత్రమే రాష్ట్రాలు పన్న్నులు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన విద్యుత్తు మరో రాష్ట్రంలో వినియోగించే అవకాశం ఉన్నందున, విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు విధించినట్లయితే అది మరో రాష్ట్రంలోని ప్రజలపై పన్ను విధించినట్టే అవుతుందని, ఏ రాష్ట్రానికీ మరో రాష్ట్రంలో ప్రజలపై పన్నులు విధించే అధికారం లేదని వివరించింది.

అలాగే రాజ్యాంగంలోని 286వ అధికరణం ప్రకారం రాష్ట్ర పరిధి దాటి సాగే సరఫరాపై ఎలాంటి వస్తు, సేవల పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్రం తెలియజేసింది. అలాగే ఆర్టికల్ 287, 288 ప్రకారం కేంద్ర ప్రభుత్వం వినియోగించే లేదా కొనుగోలు చేసే విద్యుత్తుపై రాష్ట్రాలు పన్నులు విధించడం కుదరదని పేర్కొంది.

- Advertisement -

కొన్ని రాష్ట్రాలు జల విద్యుత్తు ఉత్పత్తిపై పన్నులు విధిస్తున్నాయని, రాజ్యాంగంలో 56వ ప్రవేశిక ప్రకారం అంతర్రాష్ట్ర నదులు కేంద్రం పరిధిలో ఉంటాయని వెల్లడించింది. అలాంటి నదులపై నిర్మించిన జలవిద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తుపై పన్నులు వేసే అధికారం రాష్ట్రాలకు లేదని వెల్లడించింది. జల విద్యుత్తు కేంద్రాలు విద్యుదుత్పత్తి కోసం నీటిని ఖర్చు చేయవని, కేవలం నీటి ప్రవాహం టర్బైన్లను తిప్పడం ద్వారా మాత్రమే విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని స్పష్టం చేసింది.

ఇదే సూత్రం పవన విద్యుత్తుకు కూడా వర్తిస్తుందని, గాలి ద్వారా టర్బైన్లు తిరిగి విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని పేర్కొంది. అలాంటప్పుడు నీటి సెస్, గాలి సెస్ పేరుతో పన్ను విధించడం సమంజసం కాదని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపంలోనూ విద్యుత్తు ఉత్పత్తిపై పన్నులు విధించకూడదని, ఒకవేళ ఇప్పటికే విధించినట్టయితే తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement