Tuesday, May 21, 2024

పోర్ట్‌లను రాష్ట్రాలే అభివృద్ధి చేసుకోవచ్చు.. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ పోర్టుల చట్టాన్ని సవరిస్తూ తీసుకురాబోతున్న కొత్త బిల్లు వల్ల మైనర్‌ పోర్టులపై రాష్ట్రాలు తమ ఆధిపత్యాన్ని కోల్పోవని పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు. ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు 2022 ద్వారా మైనర్‌ పోర్టులపై ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలు చెలాయిస్తున్న ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అని రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే పోర్ట్‌ల చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. కొత్తగా ప్రతిపాదించిన పోర్టుల బిల్లుపై ఫెడరల్‌ స్ఫూర్తికి అనుగుణంగా ఇప్పటికే పలు దఫాలు తీర ప్రాంత రాష్ట్రాలతో తమ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరిపినట్లు సోనోవాల్‌ తెలిపారు. ఈ సంప్రదింపులలో ఆయా రాష్ట్రాలు చేసిన పలు సలహాలు, సూచనలను ముసాయిదా బిల్లులో పొందపరిచారు. ఈ బిల్లు ద్వారా ఆయా రాష్ట్రాలు తమకు నచ్చిన విధంగా పోర్టుల రంగాన్ని అభివృద్ధి చేసుకునే వెసులుబాటు ఉందని మంత్రి పేర్కొన్నారు. ఎప్పుడో 1908లో తీసుకువచ్చిన ఇండియన్‌ పోర్ట్స్‌ చట్టంలోని అనేక అంశాలకు కాలదోషం పట్టింది. నౌకా వాణిజ్యం, రేవుల అభివృద్ధి, నిర్వహణలో సాధించిన పురోగతికి అవి ఏమాత్రం అనుగుణంగా లేవు. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునికతో కూడిన క్రియాశీలమైన మార్పులతో ఇండియన్ పోర్ట్స్ బిల్లు 2022ను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ బిల్లు అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా దేశంలోని రేవుల సుస్థిరాభివృద్ధిని కాంక్షిస్తుంది. అలాగే తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రం పరస్పర సహాయ సహకారాల ద్వారా పోర్టుల అభివృద్ధికి ఈ బిల్లు దోహదం చేస్తుందని మంత్రి చెప్పారు.

ఔషధ మొక్కలపై ఏపీలో పరిశోధనా కేంద్రాలు..

తిరుపతిలోని సిద్ధ రీసెర్చ్ యూనిట్, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ యూనిట్లు ఔషధ మొక్కలపై పరిశోధన, అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసినవేనని ఆయుష్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం తెలిపారు. ఔషధ మొక్కలపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండు పరిశోధనా కేంద్రాలు పని చేస్తున్నాయి. ఏపీలో ప్రత్యేకంగా ఔషధ మొక్కల పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ పలు కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ కౌన్సిళ్ళ సహకారంతో ఔషధ మెక్కల పరిశోధన, అభివృద్ధి కోసం పలు రాష్ట్రాల్లో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్‌ (సీసీఆర్‌ఏఎస్‌)లో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 14 చోట్ల పరిశోధనా కేంద్రాలను నెలకొల్పిందని మంత్రి తెలిపారు. అదే విధంగా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ కింద 5 రాష్ట్రాల్లో, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి కింద మూడు రాష్ట్రాల్లో, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ కింద మూడు రాష్ట్రాల్లో రీసెర్చ్ కేంద్రాలు ఏర్పాటు చేసామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement