Saturday, April 27, 2024

Delhi | ఆధ్యాత్మిక తాళపత్రాలను డిజిటలైజ్‌ చేయండి.. కేంద్రమంత్రిని కోరిన తిరువడుత్తురై ఆధీనం పీఠాధిపతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తమిళనాడులోని తిరువడుత్తురై మఠం ఆధీనంలో ఉన్న విలువైన ఆధ్యాత్మిక తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేయాలని ప్రస్తుత పీఠాధిపతి శ్రీ అలంబలవాన పండారా సన్నిధి స్వామి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిష్టించిన పవిత్ర రాజదండం ‘సెంగోల్’ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన ఆయన బుధవారం న్యూఢిల్లీలోని కేంద్రమంత్రి నివాసానికి వెళ్లి ఆశ్వీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరువడుత్తురై మఠం ఆధీనంలో జరగుతున్న కార్యక్రమాలు, శ్రీ మయూరనాథ స్వామి దేవాలయ విశిష్టత, తమ వద్దనున్న ఆలయాలు – వాటి ప్రాధాన్యత, తాళపత్ర గ్రంథాల నిధి, ఆధ్యాత్మిక సంపద తదితర అంశాలను పీఠాధిపతి కేంద్రమంత్రికి వివరించారు.

తాళపత్ర గ్రంథాల డిజిటలీకరణ, ఆ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఆయన పలు విజ్ఞప్తులు చేశారు. కేంద్ర పురావస్తు శాఖ అధికారులను మఠానికి పంపి వారితో సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి పీఠాధిపతికి హామీ ఇచ్చారు. 1947లో నాటి ప్రధాని నెహ్రూకు రాజదండం ‘సెంగోల్’ను అందించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ చక్రవర్తుల రాజగోపాలచారి తిరువడుత్తురై మఠం ద్వారానే సెంగోల్‌కు రూపకల్పన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement