Thursday, April 18, 2024

Special Story : అమెరికాలో తుపాకీ సంస్కృతికి చ‌ర‌మ‌గీతం – జో బైడెన్ చారిత్ర‌క సంత‌కం

అమెరికాలో గ‌న్ క‌ల్చ‌ర్ పెట్రేగిపోతుంది. దాదాపు రోజుకి 53మంది తుపాకుల‌కి బ‌లి అవుతున్నారు..కాగా అమెరికాలో జరిగే హత్యల్లో 79శాతం గన్‌లు ఉపయోగించి జరుగుతున్నవే. ఈ సంస్కృతి అమెరికాలో ఈ ఏడాదో, గత సంవత్సరమో లేదంటే ఈ పదేళ్ల కాలంలోనో పెరగలేదు. ఐదు దశాబ్దాలపై నుంచి అమెరికాలో గన్ కల్చర్ అదుపుతప్పింది. గన్ ఉండడం స్టేటస్ సింబల్‌గా భావించే మనస్తత్వం ఆ దేశ ప్రజలది. వీటన్నింటి ఫలితమే దేశంలో ప్రతీరోజూ ఎక్కడో చోట జరిగే విచ్చలవిడి కాల్పులు.1968 నుంచి 2017 మధ్య తుపాకి విష సంస్కృతికి 15 లక్షల మంది అమాయకులు చనిపోయారు. 1775లో అమెరికా స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక యుద్ధాల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కంటే…గన్ కల్చర్ బలితీసుకున్న సాధారణ ప్రజల సంఖ్యే ఎక్కువ. దీన్ని బట్టే ఆయుధానికి అమెరికన్ల జీవితాల్లో ఎంత ప్రాధాన్యముందో అర్థం చేసుకోవచ్చు. 2020లో అయితే ఎన్నడూ లేని విధంగా తుపాకులు హత్యలు, ఆత్మహత్యల రూపంలో 45వేలమంది అమెరికన్ల ఉసురు తీశాయి.

2018 నాటికి అమెరికాలో 39కోట్ల ఆయుధాలున్నాయి. గడచిన దశాబ్దకాలంలో ఆయుధాల సంఖ్య మరింత పెరిగింది. 2011 నాటికి ప్రతి వందమంది దగ్గర 88ఆయుధాలుంటే…ఇప్పుడు ప్రతి వందమంది దగ్గర 120 ఆయుధాలున్నాయి. ప్రస్తుతం కోటీ 10లక్షల మంది అమెరికా ప్రజల దగ్గర ఆయుధాలున్నాయి. 50ఏళ్ల క్రితమే ఆందోళనకర సమస్యగా ఉన్న గన్‌కల్చర్ ని అంత‌మొందించేందుకు తొలి అడుగు ప‌డింది. గ‌న్ క‌ల్చ‌ర్ కి స్వ‌స్తి ప‌ల‌నుంది అక్క‌డి ప్ర‌భుత్వం..దాంతో అగ్రరాజ్యంలో తుపాకుల విక్రయాలపై నియంత్రణ ఉండనుంది. అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టంపై అధ్యక్షుడు జోబైడెన్ చారిత్రక సంతకం చేశారు. తుపాకుల నియంత్రణకు కొన్ని దశాబ్ధాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద చట్టం ఇదే.ఈ బిల్లుపై చారిత్రక సంతకం చేశాక జోబైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చట్టం చాలా మంది ప్రాణాలను కాపాడనుంది అని ప్రకటించారు. ఇటీవల టెక్సాస్ లోని బఫెలో కాల్పుల ఘటన తర్వాత ఈ బిల్లు తెరపైకి వచ్చింది.

ఈ బిల్లు ప్రతినిధుల సభలో 234-193 ఓట్ల తేడాతో పాస్ అయ్యింది. బిల్లుకు అనుకూలంగా 14 మంది రిపబ్లికన్లు కూడా ఓటింగ్ చేయడం గమనార్హం.సెనెట్ లో ఆమోదం పోందిన ఈ బిల్లు ఇక అమెరికాలో తుపాకుల నియంత్రణకు ఎంతో దోహదపడనుంది. జోబైడెన్ మాట్లాడుతూ.. జులై 11వ తేదీన బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ సభ్యులు.. అమెరికాలో తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడారని తెలిపారు. బాధితులతో కలిసి సంబరాలు జరుపుకోనున్నట్లు వెల్లడించారు. నేను అనుకున్న ప్రతి ఒక్కటీ ఈ బిల్లు ద్వారా సాధించలేనన్నారు. కాకపోతే ప్రజల ప్రాణాలను కాపాడే నిబంధనలు దీనిలో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఇది సరిపోతుందని.. వాషింగ్టన్ ఏం చేయలేదు అనుకునే సమయంలో మేం కొంత చేశామన్నారు. ఒకవేళ మేం రాజీపడి ఉంటే చాలా కీలక విషయాల్లో వెనక్కి తగ్గాల్సి ఉంటుందని తెలిపారు. చట్టం ప్రకారం 21 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న తుపాకీ కొనుగోలుదారుల కోసం కఠినమైన తనిఖీలు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement