Friday, May 3, 2024

స్కూల్‌ యనిఫామ్​ లేకుండానే బడికి.. రేపటి నుంచి బడులు పున:ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉచిత రెండు జతల యూనిఫామ్స్‌ ఇంత వరకు ఇవ్వనేలేదు. రేపటి నుంచి బడులు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు స్కూల్‌ యూనిఫామ్స్‌ లేకుండానే సాధారణ దుస్తుల్లో బడులకు వెళ్లాల్సి వస్తోంది. ముందస్తు ప్రణాళికలు లేకుండా అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే విద్యార్థులకు యూనిఫామ్స్‌ అందడంలేదని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతేడాది కూడా విద్యార్థులకు యూనిఫామ్స్‌ను ఇవ్వలేదు. ఈసారైనా బడులు ప్రారంభమయ్యే సమయానికి యూనిఫామ్స్‌లు అందుతాయంటే అదీలేదు. ఎప్పుడు అందుతాయో కూడా తెల్వని పరిస్థితి. రాష్ట్రంలోని 26,072 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 24 లక్షల వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఒక్కో యూనిఫామ్‌ కోసం ప్రభుత్వం దాదాపు ఆరువందలు రూపాయల చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తం విద్యార్థులకు అయ్యే ఖర్చులో 60 శాతం వరకు నిధులు కేంద్రమే ఇవ్వనుంది. ప్రభుత్వ బడుల విద్యార్థులకు యూనిఫామ్స్‌ కోసం దాదాపు 1.5కోట్ల మీటర్ల క్లాత్‌ అవసరం పడుతోంది. ఈ క్లాత్‌ పంపిణీ చేసేందుకు టెస్కోతో విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. ఆర్డర్‌ ఇవ్వడంలో ఆలస్యమవ్వడంతో యూనిఫామ్స్‌ పంపిణీలో ఆలస్యం కానుంది. 1.5 కోట్ల మీటర్ల క్లాత్‌లో ప్రస్తుతం 60 లక్షల మీటర్ల క్లాత్‌ను ప్రస్తుతం జిల్లాలకు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన 65 లక్షల మీటర్ల క్లాత్‌ను ఈనెలాఖరు వరకు పంపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇలా పంపించిన క్లాత్‌ జిల్లాల నుండి బడులకు చేరి విద్యార్థులకు యూనిఫామ్స్‌ పంపిణీ చేయాలంటే మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గతేడాది ఇవ్వలేదు…

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్స్‌ కోసం అవసరం మేరకు క్లాత్‌ కోసం రాష్ట్ర హాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌(టెస్కో)కు నాలుగు నెలల ముందుగానే ఆర్డర్‌ ఇస్తారు. గతేడాది 2021-22 అకడమిక్‌ ఇయర్‌ కోసం అప్పటి విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రారాంచంద్రన్‌ ఆర్డర్‌ ఇచ్చారు. కరోనా తీవ్రత కారణంగా ఆ ఆర్డర్‌ను రద్దు చేశారు. ఆ తర్వాత కరోనా తగ్గి బడులు ప్రారంభమైనా క్లాత్‌కు మళ్లిd ఆర్డర్‌ ఇవ్వలేదు,. దాంతో ఆ ఏడాది యూనిఫామ్స్‌ పంపిణీ చేయలేదు. దీంతో గతేడాదిలో చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లలకు యూనిఫామ్స్‌ను షాపుల్లో కొనుకున్నారు. సమయానికి విద్యార్థులకు యూనిఫామ్స్‌ అందివ్వకపోతే ఈ ఏడాది కూడా బయటి నుంచే కొనుగోలు చేసుకోక తప్పలేలా లేదు.

సమస్యలతో బడులు స్వాగతం…

- Advertisement -

రేపటి నుంచి బడులు పున:ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభంకానుంది. ఈక్రమంలో అరకొర సౌకర్యాలు, వివిధ రకాల సమస్యలతో విద్యార్థులకు బడులు స్వాగతం పలకబోతున్నాయి. పుస్తకాలు ఇంకా అందలేదు.. స్కూల్‌ యూనిఫామ్స్‌ ఇవ్వలేదు..సరిపడా టీచర్లు, లేరు.. పారశుద్ధ్య కార్మికుల సమస్య అలానే ఉంది. సరిపడా ఎంఈఓలు, డీఈవో అధికారులు లేరు. ఇలాంటి సమస్యల నడుమ రేపటి నుండి విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: టీఎస్‌ యూటీఎఫ్‌

విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్‌ యూటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఖాళీ పోస్టులను పదోన్నతులు, నియామకాల ద్వారా భర్తీ చేయాలని తెలిపింది. పారిశుద్ధ్య నిర్వహణ కోసం సర్వీస్‌ పర్సన్స్‌ను నియమించాలని పేర్కొంది. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ వెంటనే సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రత్యక్ష నియామకాలు జరిగేలోపు విద్యావాలంటీర్లను నియమించాలని పేర్కొంది. పాఠశాలల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయించాలని తెలిపింది. లేకుంటే దశల వారీగా పోరాటం చేస్తామని ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement