Tuesday, April 30, 2024

ఆగస్ట్‌ 15 నుంచి స్కిల్‌హబ్స్‌.. తొలివిడతగా రాష్ట్రంలో 66 స్కిల్‌హబ్స్‌ ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఆగస్ట్‌ 15 నుంచి స్కిల్‌హబ్స్‌ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కె.అజయ్‌ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం సంస్థ ఎండీ ఎస్‌.సత్యనారాయణ, సలహాదారు చల్ల మధుసూదన రెడ్డితో కల్సి జాబ్‌ క్యాలండర్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నైపుణ్యాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్ళడంలో భాగంగా 175 నియోజక వర్గాల్లో స్కిల్‌హబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, తొలి విడతగా ఆగస్ట్‌ 15న 66 స్కిల్‌హబ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మోడల్‌ స్కిల్‌హబ్‌ను ఈనెల 15న రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విశాఖపట్నంలో ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో 525 డిగ్రీ కళాశాలల ద్వారా 102 సీఎం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది 300కు పైగా జాబ్‌మేళాలు, స్కిల్‌ కనెక్ట్‌ డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు సౌకర్యార్థం నెలలో ఒక మంగళవారం స్కిల్‌ కనెక్ట్‌ డ్రైవ్‌, ఒక శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించే విధంగా కార్యచరణ రూపొందించినట్లు వివరించారు. ఈ ఏడాది లక్షమందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. సంస్థ ఎండీ ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ స్కిల్‌ హబ్స్‌ ద్వారా ఇచ్చే శిక్షణలో పరిశ్రమలకు భాగస్వామ్యం చశామన్నారు. స్కిల్‌హబ్స్‌లో స్థానిక పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా, ఇతర రాష్ట్రాల్లో ఉపాధికి అవకాశం ఉన్న కోర్సులు, స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన విద్యార్థులకు 80 శాతం ఉపాధి కల్పించేలా పరిశ్రమలతో ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. స్కిల్‌ కనెక్ట్‌ డ్రైవ్‌లో జాబ్‌మేళలు నిర్వహించేలా క్యాలండర్‌ను తయారుచేయడం జరిగిందన్నారు.

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సలహాదారు చల్లా మధుసూధనరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 14 లక్షల మందికి 36 సెక్టార్ల ద్వారా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మల్టినేషనల్‌ కంపెనీలతో ఒప్పందాల ద్వారా మంచి నైపుణ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజక వర్గ పరిధిలో స్కిల్‌ కళాశాలల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థల సేకరణ, నిర్మాణం తదితర విషయాల్లో జాప్యం చోటు చేసుకోవడంతో తాత్కాలిక కళాశాలల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. 15 తాత్కాలిక స్కిల్‌ కాలేజీలకు భవనాలను గుర్తించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఈడీలు రామకోటి రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement