Monday, April 29, 2024

పంజాజ్‌లో మూక దాడి.. జెండాను అపవిత్రం చేసిన యువకుడు.. కొట్టి చంపిన స్థానికులు

చండీగడ్‌ : పంజాబ్‌లో సిక్కుల పవిత్ర ఆలయాలను ఆగంతకులు లక్ష్యం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. స్వర్ణ దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మరువక ముందే.. కపూర్తాలాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నిజాంపూర్‌ గ్రామంలో ఓ వ్యక్తి గురుద్వారాలో చొరబడి.. సిక్కుల పవిత్ర పతాకం నిషాన్‌ సాహిబ్‌ను అపవిత్రం చేస్తూ స్థానికుల కంటపడ్డాడు. దీంతో అతన్ని చుట్టుముట్టిన సిక్కులు.. దాడి చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఓ గదిలో నిర్బంధించారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. యువకుడిని విడిపించేందుకు ప్రయత్నించారు.

అయితే సిక్కు యువకులకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. గదిలో బంధించిన యువకుడిపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వరుసగా జరుగుతున్న ఘటనలపై పంజాబ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఇలాంటి పనులు చేసేవారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఆదేశించారు. దీనిలో భాగంగా ఆదివారం ఆయన స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులతో పాటు ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో శనివారం రాత్రి బీభత్సం సృష్టించిన ఓ వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. అమృత్‌సర్‌, కపూర్తాలాలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని డీజీపీ ఛటోపాధ్యాయ అన్నారు. రాష్ట్రంలో మత సామరస్యానికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పంజాబ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement