Monday, April 15, 2024

జైపూర్‌ విమానాశ్రయంలో.. 2 కిలోల హెరాయిన్‌ పట్టివేత..

జైపూర్‌ : రాజస్థాన్‌లోని జైపూర్‌ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. షార్జా నుంచి ఎయిర్‌ అరేబియా విమానంలో వచ్చిన ఆఫ్రికన్‌ మహిళ వద్ద లభ్యమైన 2 కిలోల హెరాయిన్‌ విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు వివరించారు. సదరు మహిళను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కస్టమ్స్‌ విభాగానికి చెందిన కమిషనర్‌ రాహుల్‌ నాంగరే మాట్లాడుతూ.. 2 కిలోల హెరాయిన్‌ను సూట్‌కేసులో తీసుకొచ్చినట్టు తెలిపారు.

చెకింగ్‌ సందర్భంగా మహిళ సూట్‌కేసును తనిఖీ చేయగా.. హెరాయిన్‌ లభించినట్టు వివరించారు. డ్రగ్‌ డిటెక్టర్‌ను పిలిపించిన కస్టమ్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌.. పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి.. పట్టుబడింది హెరాయిన్‌గా తేల్చింది. కస్టమ్స్‌ విభాగంలోని డీఆర్‌ఐ బృందం కూడా విచారణలో భాగస్వాములైంది. ఎక్కడి నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చింది..? ఎక్కడికి తీసుకెళ్తోంది..? ఎవరైనా తీసుకొచ్చేందుకు చెప్పారా..? అన్న రీతిలో ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో ఆఫ్రికన్‌ మహిళను కస్టమ్స్‌, డీఆర్‌ఐ బృందంలోని సభ్యులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement