Tuesday, May 21, 2024

కమలానికి శ్రావణం సెంటిమెంట్.. ఊపందుకున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ స్పీడు పెంచింది. ఇందులో భాగంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర సీనియర్ నేతల ఢిల్లీ పర్యటన, కేంద్ర పెద్దలతో మంతనాలు అనేక ఊహాగానాలకు తావిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం, ఇతర పార్టీల నుంచి చేరికల కోసం ఏర్పాటు చేసిన కమిటీకి కన్వీనర్‌గా ఉన్న ఈటల, కో కన్వీనర్‌గా ఉన్న డీకే అరుణ, ఇతర సభ్యులు సోమవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌లో సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం, టీఆర్‌ఎస్ నాయకులతో సన్నిహిత సంబంధాలున్న ఈటల కేంద్ర నాయకత్వం అప్పగించిన పనిని సైలెంటుగా చేసుకుంటూ వెళ్లారు. కీలక సమాచారంతో వారంతా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్‌తో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాను రహస్యంగా సేకరించిన సమాచారాన్ని తరుణ్ చుగ్ ముందుంచినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న వారి వివరాలను ఈటల తరుణ్ చుగ్‌కు అందజేశారు. బండి సంజయ్ చేపడుతున్న మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర, బైక్ ర్యాలీలు, బలమైన నాయకులు, ఇతర నేతల బలహీనతల గురించీ చర్చంచినట్టు తెలుస్తోంది.

ఈటల అందించిన లిస్టులో టీఆర్‌ఎస్‌లో వివిధ పదవుల్లో ఉన్న వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఛైర్మన్లు, కౌన్సిలర్లు ఉన్నట్టు సమాచారం. ఆయా నియోజక వర్గాల్లో బాగా పట్టున్న సీనియర్ నేతలను తమవైపు ఆకర్షిస్తే క్యాడర్ కూడా కదిలి వచ్చే అవకాశముందని హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తుండడం వల్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా బిజీగా ఉన్నారు. దీంతో రాష్ట్ర నేతలు సమావేశాల అనంతరం మరింత సమాచారంతో ఢిల్లీ వచ్చే అవకాశముంది. శ్రావణ మాసంలోనే సెంటిమెంటుగా కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలతో టీ కాంగ్రెస్ నేతల సమావేశం, మరోవైపు తెలంగాణా బీజేపీ నేతల ఢిల్లీ టూర్‌తో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement