Monday, May 6, 2024

పీకే చొరవవల్లే తృణమూల్‌లో చేరానన్న శతృజ్ఞసిన్హా..

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చొరవ, ప్రోద్బలంతోనే వెస్ట్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారని మాజీ బీజేపీ నేత, ఒకప్పటి సినీనటుడు శతృఘ్నసిన్హా చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఆయన తృణమూల్‌లో చేరుతున్నట్లు తాజాగా ప్రకటించారు. ప్రశాంత్‌ కిషోర్‌ తనను కలసి తృణమూల్‌ చేరేందుకు తగిన కారణాలు వివరించారని, ఈ విషయంలో ఎన్నోసార్లు సుదీర్ఘంగా చర్చించామని, అనేక విషయాలను లోతుగా పరిశీలించామని చెప్పారు. చివరకు తృణమూల్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ విషయంలో పీకేతోపాటు మాజీ కేంద్రమంత్రి, మాజీ బీజేపీ నేత యశ్వంత్‌ సిన్హా కూడా కీలకపాత్ర పోషించారని శతృఘ్నసిన్హా వెల్లడించారు.

కాని పశ్చిమబెంగాల్‌ ఉపఎన్నికల్లో అసన్‌సోల్‌ లోక్‌సభ స్థానంనుంచి తనను తృణమూల్‌ అభ్యర్థిగా మమత ప్రకటించడం తనకు దక్కిన గౌరవమని, ఆ పార్టీలో చేరడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని ప్రకటించారు. ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీకి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమె సమర్థురాలని, తాను ఎన్నటికీ ఆమె వెంటే ఉంటానని ఆయన అన్నారు. మొదట బీజేపీలోను, 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లోను చేరిన శతృఘ్నసిన్హా ఇప్పుడు తృణమూల్‌లో చేరుతున్నారు. పదేపదే పార్టీలు మారడంపై వ్యాఖ్యానించబోనన్న ఆయన బీహార్‌కు చెందినవాడినే అయినా ప.బెంగాల్‌లో పోటీ చేయడాన్ని సమర్థించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement