Wednesday, May 1, 2024

Scotland : నీట మునిగి ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. వీరిని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న చాణక్య బొలిశెట్టి (22), జితేంద్రనాథ్ కరుటూరి (27)గా గుర్తించారు.

- Advertisement -

వాటర్‌ఫాల్స్‌కు పాపులర్‌ అయిన లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు. అత్యవసర సేవల ద్వారా ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. డూండీ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేస్తుండగా, ప్రమాద వశాత్తూ ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి.

కాగా భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించింది వారికి తగిన సహాయాన్ని అందిస్తోంది. అలాగే ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అటు డూండీ విశ్వవిద్యాలయం కూడా తగిన సాయాన్ని హామీ ఇచ్చింది. పోస్ట్‌మార్టం అనంతరం వారి మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement