Wednesday, May 1, 2024

MUMBAI: మరాఠాల రిజర్వేషన్లకు ఓకే… దీక్ష విరమణ…

మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం ముగిసింది. వారి డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో ఉద్యమకారుడు మనోజ్‌ జరాంగే తన నిరసన దీక్షను విరమించారు. మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్‌ జరాంగే నేతృత్వంలో కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీరి డిమాండ్లను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించి తాడోపేడో తేల్చుకోవడానికి జరాంగే నేతృత్వంలో వేలమంది ముంబై దిశగా ర్యాలీ చేపట్టారు. అయినా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో తాజాగా జరాంగే డెడ్‌లైన్‌ విధించారు.

‘రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్నది. ర్యాలీ దాదాపు ముంబై దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పే మాటలు వినే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఉదయం 11 గంటలలోపు అధికార ప్రకటన చేయాలి. లేకుంటే 12 గంటలకు కార్యాచరణ ప్రకటిస్తా. మా అడుగులు ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌ దిశగానే పడుతాయి. ఒక్కసారి అడుగు పడిందంటే వెనక్కి తిరిగి చూసేది లేదు. మా డిమాండ్‌ను సాధించుకున్నాకే తిరిగి ఇంటికి వెళ్తాం’ అని జరాంగే ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

శుక్రవారం నుంచే తిండి తినడం మానేశానని, కేవలం నీళ్లు తాగుతున్నానని తెలిపారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్‌ను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించారు. వీరి డెడ్‌లైన్‌కు దిగివచ్చిన మహా సర్కార్‌.. డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. దీంతో వారు దీక్షను విరమించారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement