Friday, May 17, 2024

Sales | పండుగ సీజన్లో వాహన విక్రయాల జోరు..

ఈ సంవత్సరం పండగల సీజన్‌ మొత్తం 42 రోజుల్లో వాహనాల విక్రయాలు జోరుగా, రికార్డు స్థాయిలో జరిగాయి. ట్రాక్టర్లు మినహాయించి అన్ని విభాగాల వాహనాల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) తెలిపింది. నవరాత్రితో మొదలై ధనత్రయోదశి తరువాత 15 రోజుల వరకు కొసాగిన 42 రోజుల పండగ సీజన్‌ అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 25 వరకు మొత్తం వాహన విక్రయాలు 19 శాతం పెరిగి 37,93,584 యూనిట్లుగా నమోదయ్యాయి.

గత సంవత్సరం ఇదే పండగల సీజన్‌లో 31,95,213 వాహనాల అమ్మకాలు జరిగాయని ఫాడా తెలిపింది.
ద్విచక్ర వాహనాల అమ్మకాలు 21 శాతం, త్రీ వీలర్స్‌ అమ్మకాలు 41 శాతం, వాణిజ్య వాహనాల అమ్మకాలు 8 శాతం, ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం 0.5 శాతం తగ్గాయి.

ప్యాసింజర్‌ కార్లు…

- Advertisement -

ప్రయాణికుల వాహన విక్రయాలు 4,96,047 యూనిట్ల నుంచి 10.32 శాతం పెరిగి 5,47,246 యూనిట్లకు చేరాయి. సీజన్‌ మొదట్లో ఈ విభాగంలో అమ్మకాలు పెద్దగా లేనప్పటికీ, దీపావళి నుంచి పుంజుకున్నాయని ఫాడా అధ్యక్షుడు మనీష్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు. ప్యాసింజర్‌ కార్ల విభాగంలో అత్యధికంగా ఎస్‌యూవీల అమ్మకాలు జరిగాయని ఆయన తెలిపారు.

ద్విచక్ర వాహనల విక్రయాలు 20.71 శాతం పెరిగాయి. గత సంవత్సరం 23,96,665 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈ సారి సీజన్‌లో 28,93,107 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడంతో ఈ విభాగంలో రికార్డు స్థాయి విక్రయాలు నమోదైనట్లు ఫాడా తెలిపింది. వాణిజ్య వాహన విక్రయాలు 8.11 శాతం పెరిగి 1,23,784 యూనిట్లుగా నమోదయ్యాయి.

త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్లు 1,01,052 యూనిట్ల నుంచి 41.39 శాతం పెరిగి 1,42,875 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు గత సంత్సరం ఇదే కాలంలో 86,951 యూనిట్లుగా ఉంటే, ఈ సారి 0.44 శాతం తగ్గి 86,572 యూనిట్లుగా ఉన్నాయి. నవంబర్‌ 27 వరకు జరిగిన వాహన అమ్మకాల సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ నుంచి సేకరించినట్లు ఫాడా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement