Monday, April 29, 2024

Kurnool – కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం – మంత్రి బుగ్గన

కర్నూలు, నవంబర్ 28: ప్రభ న్యూస్ బ్యూరో.వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.. మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో రూ.5.95 కోట్లతో ఏర్పాటు చేసిన న్యూ క్యాథ్‌ ల్యాబ్ ను, న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన సి. టి .స్కాన్ ను, రక్తనిధి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన యంత్రాల పని తీరును సంబంధిత వైద్యుల ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి,కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీ మధుసూదన్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, నగర మేయర్ బివై.రామయ్య, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటరంగారెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.సుధాకర్, సిఎస్ఆర్ఎంఓ బివి.రావు, యూరాలజీ విభాగ ప్రొఫెసర్ సీతారామయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

.ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా తో మాట్లాడుతూ క్యాత్ లాబ్ ద్వారా గుండెకు సంబంధించిన యాంజియో, న్యూరాలజీకి, నెఫ్రాలజీకి, మెదడుకు సంబంధించిన రక్తపు నాళాల్లో ఏర్పడుతున్న అడ్డంకులను గుర్తించవచ్చన్నారు.. సిటి స్కాన్ ద్వారా శరీరంలో ఉండే గుండె, లివర్, ప్యాంక్రియాస్, బ్లాడర్, రక్తనాళాలు, ఎముకలు స్కాన్ చేసి 360 డిగ్రీలు మనిషిని స్కాన్ చేయవచ్చన్నారు. అదే విధంగా పెద్ద రక్తనిధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల్లాగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కూడా కోట్ల రూపాయల ఖర్చుతో ఎంత ఆధునిక టెక్నాలజీ కలిగిన పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.. కర్నూలు జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చుట్టుపక్కల జిల్లాలతో పాటు సరిహద్దు ప్రాంతమైన తెలంగాణ నుంచి కూడా ఎక్కువ శాతం ప్రజలు వస్తుంటారని, పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు.. 200 వరకు ఉన్న 104 వాహనాలను 900 వరకు పెంచారని, 400 వరకు 108 వాహనాలు ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో దాదాపు వెయ్యి వరకు 108 వాహనాలను పెంచడం జరిగిందన్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో వెయ్యి జబ్బులకు చికిత్స అందించే వారని, ప్రస్తుతం ప్రభుత్వం సుమారుగా 3 వేల జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్య మానవునికి సేవలందించడం జరుగుతోందన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆరోగ్యశ్రీకి దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగితే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మూడువేల రకాల జబ్బులకు సుమారు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.. గతంలో 20 లక్షల మందికి చికిత్స అందిస్తే , ఈ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ ద్వారా 45 లక్షల మందికి వైద్య సేవలు అందించామని, ఐదు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరం కరోనాతో కష్ట కాలం వచ్చిందని, ఆ సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడం జరిగిందన్నారు. గతంలో ఒక్క వైద్య కళాశాల కూడా లేదని, ఈ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలను కూడా స్థాపించడం జరిగిందన్నారు. కొన్ని కారణాలవల్ల ఆరోగ్యశ్రీ బిల్లులు మూడు నెలలు పెండింగ్ ఉన్నాయని, అయితే గతంలో 9 నెలలు పెండింగ్ ఉండడం కరెక్టేనా అని మంత్రి ప్రశ్నించారు.

- Advertisement -

విద్యకు, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు..వైయస్సార్ పరిపాలనలో సామాన్య మానవుడు కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం అందుతోందని భరోసా పొందాడని, ఈరోజు కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందన్న భరోసాను, నమ్మకాన్ని పొందుతున్నాడని మంత్రి వివరించారు.. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement