Monday, April 29, 2024

Followup: 108 అంబులెన్స్ ఉద్యోగులకు జీతాల్లేవ్‌.. మూడు నెల‌ల‌కోసారి వేత‌నాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇచ్చేదే తక్కువ జీతం… అది కూడా సమయానికి రాకపోవడంతో 108 సర్వీసుల్లో పనిచేసే కార్మికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ 108 సర్వీసు ఉద్యోగులకు మూడు నెలలకోసారి వేతనాలు చెల్లిస్తుండడంతో వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. రెండు నెలల జీతం పెండింగ్‌లో ఉన్నా సమస్యలతో సతమతమవుతూనే విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 436.. 108 వాహనాలు ఉన్నాయి. 108 వాహనాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవీకే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి నెల జీవీకే సంస్థకు ఒక్కో బండిపై లక్షా 45వేల చొప్పున మొత్తంరూ.6 కోట్లను మంజూరు చేస్తోంది. ఒక్కో బండికి ఇచ్చే లక్షా 45వేల నుంచే బండిపై పనిచేసే ఈఎంటీ, పాయిలెట్ల జీతాలతోపాటు డ్రైవర్‌, పాయిలెట్ల జీతాలను, డీజిల్‌ ఖర్చులను నెట్టుకురావాల్సి వస్తోంది. అయితే బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో 108 లో డీజిల్‌ పోసేందుకు డబ్బులు లేక వాహనాలు నడిపే పరిస్థితులు కూడా లేవని ఉద్యోగులు వాపోతున్నారు. వాస్తవానికి 2016లో జీవీకేతో 108 సర్వీసుల నిర్వహణపై ఒప్పందం ముగిసింది. అయినప్పటికీ ఇప్పటికీ మరోసారి టెండర్‌లను పిలవకుండా లేదంటే జీవీకేకే మరోసారి 108 సర్వీసుల బాధ్యతను అప్పగిస్తూ అదికారికంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రతి నెలా బిల్లుల కోసం జీవీకే కూడా ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న టెండరు కాపాడుకోవడం కోసం జీవీకే … బిల్లు వచ్చినపుడే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తూ వస్తోంది. దీంతో ప్రతి నెలా వేతనాలు అందక 108 కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చాన్నాళ్లుగా వేతనాలు పెంచకపోవడం, మరోవైపు ఇచ్చే జీతాలు సకాలంలో రాకపోవడంతో చాలా మంది 108 సర్వీసుల్లో ఉద్యోగాలను వదిలేసి వెళ్లిపోతున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో 108 బండిపై కనీసం 5 గురు సిబ్బంది పనిచేయాలి. అయితే ప్రస్తుతం ఒకరిద్దరు, గరిష్టంగా ముగ్గురితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ఇప్పుడు 108 సేవల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1750 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరోవైపు 108 ఉద్యోగులకు ఏపీలో, తెలంగాణ ఇస్తున్న జీతాలకు భారీగా వ్యత్యాసం ఉండటంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ)కి ఏపీలో రూ.30వేలు ఇస్తుండగా తెలంగాణలో రూ.16వేలు (జూనియర్లకు రూ.12, 500), డ్రైవర్లకు ఏపీలో రూ.28వేలు, తెలంగాణలో పదేళ్ల సీనియర్‌ అయితే రూ.16వేల నుంచి రూ.17వేలు మాత్రమే ఇస్తున్నారని 108 ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఉన్న 436 108 సర్వీసుల్లో దాదాపు 150 వాహనాల దాకా మరమ్మతులకు గురయ్యాయి. వాటిని ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద ప్రజాప్రతినిధులు, దాతలు సమకూర్చిన అంబులెన్సుల్లో 108 సర్వీ’సులను అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఐటీడీఏ , ఏజెన్సీ ఏరియాల్లో 108 సేవలు అరకొరగా అందుతున్నాయి. ఇప్పటికే 104 సేవలను దాదాపు నిర్వీర్యమవడంతో అదే తరహాలో 108 సేవలను కూడా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 108 అత్యవసర సర్వీసులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్ల్‌ాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. యాదానాయక్‌ డిమాండ్‌ చేశారు. ప్రయివేటు ఏజెన్సీకి కమిషన్‌ ఇచ్చే బదులు ఉద్యోగుల సంక్షేమంపై శ్రద్ధ వహిస్తే ప్రజలకు సేవలు మరింత మెరుగ్గా అందుతాయంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement