Friday, May 17, 2024

పురోగతిలో సాగరమాల… ఎంపీ నామా ప్రశ్నలకు నితిన్ గడ్కరీ బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా రూ .5.35 లక్షల కోట్ల అంచనాలతో సాగరమాల ప్రాజెక్ట్ కింద హైవేల విస్తరణలకు సంబంధించి 34,800 కిలోమీటర్ల మేర హైవేలను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల రింగు రోడ్లు, వాటి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, అందుకోసం చేసిన, చేస్తున్న ఖర్చు వివరాలను రాష్ట్రాల వారీగా వివరించాలని, ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుందా? అని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఆయనకు కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. భారత్‌మాల పరియోజన ఫేజ్ -1 ప్రాజెక్టును అక్టోబర్ 2017లో ప్రారంభించిందని చెప్పారు.

ఢిల్లీ-ఎన్సీఆర్, రాంచీ, కోటా, జైపూర్ నగరాల్లో రింగ్ రోడ్ల నిర్మాణం పూర్తైందని కేంద్ర మంత్రి తెలిపారు. అమృత్‌సర్, లూధియానా, జమ్మూ, పాట్నా, గురుగ్రాం, శ్రీనగర్, బెంగళూరు, నాగ్‌పూర్, జోధ్‌పూర్, మధురై, చెన్నై, వారణాసి, లక్నో నగరాలకు రింగ్ రోడ్లు, విస్తరణ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని గడ్కరీ పేర్కొన్నారు. మెజారిటీ పనుల్లో భూసేకరణకయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని తెలిపారు. అయితే కొన్ని ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భూసేకరణ వ్యయంలో కొంత భాగాన్ని భరిస్తాయని ఆయన వివరించారు. భూసేకరణలో కనీసం 50 శాతం ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయా రాష్ట్రాల అభ్యర్ధన మేరకు గ్రాండ్ ఛాలెంజ్ మెకానిజం కింద ప్రాజెక్టులను తీసుకోవాలనే నిబంధన భారత్‌మాల పథకంలో ఉందని గడ్కరీ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement