Sunday, May 5, 2024

రష్యా దూకుడు.. బెర్డియాంస్క్‌ నగరం స్వాధీనం, దీటుగా పోరాడిన ఉక్రెయిన్‌ ఆర్మీ

ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎవరూ తగ్గడం లేదు. బెలారస్‌ సరిహద్దులో ఇరు దేశాల ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరుగుతున్నా.. రష్యా దూకుడు మాత్రం ఆగడం లేదు. రష్యన్‌ ఆర్మీని ఉక్రెయిన్‌ సైన్యం కూడా ధీటుగానే ఎదుర్కొంటున్నది. ఒక్కో పట్టణాన్ని రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ వస్తున్నది. జనావాసాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా రష్య క్షిపణి దాడులకు దిగుతున్నది. అటు చర్చలు కొనసాగుతుంటే.. ఇటు ఉక్రెయిన్‌లోని ఒక్కో నగరాన్ని రష్యా హస్తగతం చేసుకుంటూ వస్తున్నది. దక్షిణ ఉక్రెయిన్‌లోని బెర్డియాంస్క్‌ అనే నగరాన్ని రష్యన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. దీంతో కెర్సెన్‌ను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోమవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని హెయిన్‌చెస్క్‌ పట్టణంతో పాటు ఓ విమానాశ్రయాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఉక్రెయిన్‌ను అన్ని వైపుల నుంచి రష్యన్‌ ఆర్మీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. అయితే.. ఉక్రెయిన్‌ సైన్యం కూడా చుక్కలు చూపిస్తున్నది. గెరిల్లా దాడులతో రష్యాపై ఉక్రెయిన్‌ విరుచుకుపడుతున్నది.

52 కి.మీ లోపలికి..

దక్షిణ ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు 52 కిలోమీటర్ల మేర రష్యన్‌ ఆర్మీ చొచ్చుకెళ్లినట్టు ఆ దేశ ప్రతినిధి వెల్లడించారు. దక్షిణ ఉక్రెయిన్‌ నగరాలను మొత్తం బ్లాక్‌ చేసినట్టు పేర్కొన్నారు. ఖార్కివ్‌ ప్రాంతంలో.. 302 యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్షిపణి వ్యవస్థ, బక్‌ ఎం-1 వాయు రక్షణ వ్యవస్థతో పాటు ఉక్రెయిన్‌ సాయుధ బలగాలు తమకు లొంగిపోయినట్టు తెలిపారు. బెర్డియాంస్క్‌ నగరం అనేది ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా ఒబ్లాస్ట్‌లోని ఓడరేవు నగరం. ఇది అజోవ్‌ సముద్రం ఉత్తర తీరంలో ఉంటుంది. ఇది నల్ల సముద్రం ఉత్తర పొడిగింపు. ఈ నగరం.. రేయాన్‌ పరిపాలనా కేంద్రంగా పని చేస్తుంది. ఇక్కడ ఎన్నో చారిత్రాత్మ కట్టడాలు ఉన్నాయి. సుమారు లక్షన్నర మంది ప్రజలు నివాసం ఉంటారు. మంచి పర్యాటక ప్రాంతంగా పేరు ప్రఖ్యాతులు సంపాధించుకుంది. అయితే ఇప్పుడు మాత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా.. మారాయి.

పర్యాటక ప్రాంతంగా బెర్డియాంస్క్‌..

ఏడు శానిటోరియంలు, 17 పిల్లల పార్కులు ఉన్నాయి. 45 రీ క్రియేషన్‌ సెంటర్లు కూడా బెర్డియాంస్క్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. యూరప్‌లోనే అతిపెద్ద ఆక్వా పార్క్‌ ఇక్కడే ఉంది. 2001లో ఆల్‌ ఉక్రెయినియన్‌ పోటీల్లో.. అత్యంత సుందరమైన నగరంగా పేరు ప్రఖ్యాతులు సంపాధించుకుంది. యూరోపియన్‌ మోడర్న్‌ సిటీగా కూడా బెర్డియాంస్క్‌ను పిలుస్తారు. ఈ నగరం మొత్తం ఓడ రేవు ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాలకు ఇక్కడి ఉత్పత్తులు తరలి వెళ్తాయి. మెటల్‌ ప్రాసెసింగ్‌, స్క్రాప్‌ మెటల్‌, బొగ్గు, సన్‌ ఫ్లవర్‌ సీడ్‌ ఆయిల్‌, ఇండస్ట్రియల్‌ ఆయిల్‌, మినరల్‌ ఆయిల్‌, పిగ్‌ ఐరన్‌ ఇక్కడి నుంచి తరలించబడుతుంది. ఫర్టిలైజర్‌, మినరల్‌ ఆయిల్‌ ప్రాసెసింగ్‌ కాంప్లెక్స్‌ కూడా బెర్డియాంస్క్‌లో ఉంది. నగరంలోని అన్ని రహదారులు, రైల్వే లైన్లు.. ఓడ రేవుతో అనుసంధానం చేయబడి ఉంటాయి. ఇక్కడి సముద్రం లోతు 28 అడుగుల వరకు ఉంటుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement