Saturday, May 4, 2024

పుంజుకున్న మార్కెట్లు.. దేశీయ మార్కెట్‌ సూచీలపై రష్యా-ఉక్రెయిన్‌ చర్చల ప్రభావం..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చల ప్రభావం దేశీయ స్టాక్‌మార్కెట్‌పై పడింది. సోమవారం స్టాక్‌మార్కెట్‌ సూచీలు లాభాలతో ముగిశాయి. పుతిన్‌ అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు జారీ..మరోవైపు రష్యాసేనలపై ఉక్రెయిన్‌ బలగాల ఎదురుదాడులతో మార్కెట్లు తొలుత భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అనంతరం సానుకూల ఫలితాల నేపథ్యంలో అనూహ్యంగా పుంజుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ 1400 పాయింట్లు లాభపడటం విశేషం. యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు నెలకొన్నప్పటికీ మన మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. ఉదయం సెన్సెక్స్‌ 55,329.46 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 56,324.54-54,833.50 మధ్య కదలాడి చివరకు 388.76పాయింట్ల లాభంతో 56,247.28వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ 16,481.60వద్ద లాభాలతో ప్రారంభమైంది. అనంతరం 16,815.90 నుంచి 16,356.30మధ్య కదలాడి చివరకు 135.50పాయింట్లు లాభాన్ని నమోదు చేసి 16,793.90 వద్ద స్థిరపడింది. క్యాపిటల్‌ మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 75.35వద్ద కొనసాగుతోంది. కాగా ఓ దశలో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకుపైగా పడిపోయింది. కానీ ఈ దశలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఉపక్రమించారు.

మరోవైపు శాంతిచర్చలకు ఇరుదేశాలు అంగీకరించడంతో సూచీలు నిలదొక్కుకున్నాయి. కుప్పకూలిన రష్యా కరెన్సీ రూబుల్‌ను ఆదుకునేందుకు రష్యా కీలక చర్యలు కూడా మార్కెట్లు పుంజుకోవడానికి కారణమయ్యాయి. బ్యాంకువడ్డీ రేటు పెంచడంతోపాటు బ్యాంకులపై ఆంక్షలను సులభతరం చేయడంకూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపింది. చమురు, గ్యాస్‌ ధరలు పెరగడంతో ఆయా రంగాలు లాభాలను నమోదు చేశాయి. ఐరోపా మార్కెట్లు, ఆసియా మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో కొనసాగినా దేశీయ మార్కెట్లు రాణించాయి. నిఫ్టీ 50సూచీలో 33షేర్లు లాభపడగా 16షేర్లు నష్టపోయాయి. ఒకటిమాత్ర స్థిరంగా ఉంది. ఆటో, బ్యాంకింగ్‌, ఆర్థికరంగ సూచీలు నష్టాలను చవిచూశాయి. లోహ, ఇంధన, బేసిక్‌ మెటీరియల్స్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు లాభపడ్డాయి. బయోకాన్‌ షేర్లు 8.75శాతం నష్టపోయాయి. ఆటోమొబైల్‌ పరికరాల తయారీసంస్థ ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌ షేర్లు 6శాతం పడిపోయాయి. సెన్సెక్స్‌ 30సూచీలో నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, టైటన్‌, ఎన్టీపీసీ, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడ్డాయి. బ్రెజిల్కు చెందిన టెరాబెల్‌ ఎంప్రీడిమెంటోస్‌తో షేర్‌ పర్చేజ్‌ ఒప్పందం కుదుర్చుకోవడంతో హిందాల్కోషేర్లు సోమవారం 8.6శాతం పెరిగాయి. మరోవైపు డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌ఎఫ్‌డీసీ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్ర, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీషేర్లు నష్టపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement