Wednesday, May 1, 2024

Revenge : ప్ర‌త్య‌ర్థి ఆర్థిక వ‌న‌రుపై దాడి.. 350 చీనీ చెట్ల నరికివేత..

అనంతపురం బ్యూరో : అనంతపురం జిల్లా నేతలు, ఫ్యాక్షన్ ను వదిలి పెట్టి ఆర్థిక వనరులపై దెబ్బకొట్టే కొత్త పంథాను ఎంచుకున్నారు. జిల్లాలో గతంలో ఫ్యాక్షన్ నాయకులు ఒకరిపై ఒకరు ముఖా ముఖి దాడులకు పాల్పడే వారు. ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి కొత్త పంథాను ఎంచుకున్నారు. ఎవరైతే తమకు విరోధులుగా ఉంటారో వారిని పూర్తిగా దెబ్బకొట్టేందుకు ఆర్థిక వనరులపై దాడులకు పూనుకుంటున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్షనిస్టులు ప్రత్యర్థులపై చేయి ప్రదర్శిస్తున్నారు. ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే మొత్తం అతని కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా తాడిపత్రి, సింగనమల, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో ఎక్కువగా చెట్లు నరికే సాంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా.. నార్పల మండలం నడిమిపల్లి గ్రామంలో భాస్కర్ నాయుడు అనే రైతుకు చెందిన 350 చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. గ్రామంలో ఇతనికి ప్రత్యర్థులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చీనీ మొక్కలు నాటిన తర్వాత ఐదు సంవత్సరాలకు కాపు వస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల దాకా రైతుకు పంట చేతికి వస్తుంది. సంవత్సరానికి రెండు పంటలు వస్తాయి. సీజన్, గై రంగం అని రెండుసార్లు పంట వస్తుంది. ప్రతి ఎకరాకి నిక‌రంగా 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది.

మార్కెట్ బాగా ఉన్నప్పుడు, 30 వేల నుంచి లక్ష రూపాయలు దాకా అమ్ముడు పోతుంది. సంవత్సరానికి రెండు పంటలు రూపంలో పది టన్నుల లెక్కన చూస్తే 6 నుంచి 10 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. పంటపై పెద్దగా ఖర్చు రాదు. ఇంత ఆదాయం వస్తున్న‌ పంట వల్ల రైతు ఆనందంగా ఉంటారు. అనంతపురం సంబంధించిన చీని కాయలు మార్కెట్ లో మంచి గిరాకీతో అమ్ముడుపోతాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అనంతపురం బత్తాయికి బడా నగరాల‌లో ప్రముఖ ప్రాధాన్యత ఉంది. దీంతో ఫ్యాక్షన్ నాయకులు తమ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ముఖ్యంగా ఆర్థిక వనరులను దెబ్బతీసేందుకు పూనుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ భవిష్యత్తులో ఎన్ని పంటలు నేలకు ఒరుగు తాయో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement