Sunday, May 5, 2024

Delhi | కాంగ్రెస్ జాబితాపై రేణుక అసంతృప్తి.. సమ న్యాయం – సామాజిక సమ తూకం లేదని విమర్శ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులో సామాజిక సమతూకం, సమ న్యాయం లేదని పెదవి విరిచారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి కాకుండా బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు ఇవ్వడంపై కూడా ఆమె విమర్శలు చేశారు.

డబ్బు ఉన్న నేతలకు కాకుండా ‘దమ్ము’ ఉన్న నేతలకు టికెట్లు పార్టీ టికెట్లు ఇవ్వాలని రేణుక చౌదరి డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం నేత గోపి ముదిరాజ్, తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక కన్వీనర్ గోపాలం విద్యాసాగర్ తదితరులను వెంటబెట్టుకుని ఆమె కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. టికెట్ల కేటాయింపు సహా పార్టీ అంతర్గత విషయాలపై ఆయనతో చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘కమ్మ’ సామాజికవర్గ నేతలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, కానీ మరో వర్గానికి ఏకంగా 38 సీట్లు ఇవ్వగా కేవలం 8 మంది మాత్రమే గెలిచారని అన్నారు. వారిలో చివరకు ఇద్దరు మాత్రమే పార్టీలో మిగిలారని రేణుక అన్నారు.

టికెట్ల కేటాయింపులో ‘కమ్మ’ కులాన్ని కూడా గుర్తించాలని, ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పరిణామాల కారణంగా ‘కమ్మ’ కులస్తులు భావోద్వేగంతో ఉన్నారని రేణుక వ్యాఖ్యానించారు. ‘కమ్మ’వారి మనోభావాల్ని పరిగణలో తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరినట్టు ఆమె చెప్పారు. పిల్లికి బిక్షం పెట్టినట్లు పార్టీ ఓడిపోయే స్థానాల్లో టికెట్లు ఇస్తే ఊరుకోబోనని, తమ కులాన్ని తక్కువగా అంచనా వేయవద్దని ఆమె హెచ్చరించారు.

తమ వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె అన్నారు. ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితా చూస్తుంటే బీసీ వర్గాలకు, కమ్మవారికి అన్యాయం జరిగిందని స్పష్టమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. తమకు సీట్లు కేటాయిస్తే తమ వర్గం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అధిష్టానం పెద్దలకు చెప్పినట్టు రేణుక చౌదరి తెలిపారు. ఇతర పార్టీలు తమ వర్గం నేతలను పిలిచి మరీ టికెట్లు ఇస్తున్నాయని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement