Tuesday, May 14, 2024

Delhi | నకిలీ ఓటర్ల నమోదు జరుగుతోంది.. కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తీసేశారని పేర్కొన్నారు. విశాఖ కలెక్టర్, రిటర్నింగ్ అధికారితో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లపై ఆరోపణలు చేశారు. బూత్ లెవెల్ అధికారులు పూర్తిగా అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని వెలగపూడి లేఖలో పేర్కొన్నారు.

2019 నుంచి ఇప్పటి వరకు విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తొలగించారని వెలగపూడి తెలిపారు. ఈ అంశంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. నియోజకవర్గంలో తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని అన్నారు. అదే సమయంలో సుమారు 17,500 కొత్త ఓటర్ల పేరు జాబితాలో చేరాయని, వాటిలో చాలా వరకు దొంగ ఓటర్లే ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement