Wednesday, May 1, 2024

Delhi | మోదీ నాయకత్వంలో దళితులకు రక్షణ కరువు.. భీమ్ ఆర్మీ చీఫ్​కు బీఆర్ఎస్ సపోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాని మోదీ హయాంలో దేశంలో దళితులు, గిరిజనులపై హింస రోజురోజుకు పెరుగుతోందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలపై అగ్రవర్ణాల దాష్టికం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భీమ్ ఆర్మీ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆయన, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్‌పై జరిపిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు. జంతర్ మంతర్ భీమ్ ఆర్మీ ధర్నాలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత బొర్లకుంట, పి. రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కొత్త ప్రభాకర్ రెడ్డి.. కాల్పులు జరిపినవారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ ఆజాద్‌కు భద్రత కల్పించాలని, ఆయనకు ఏం జరిగినా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. దళితులపై ఇలాంటి దాడుల చేసే వారికి సరైన గుణపాఠం చెప్పే విధంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని తెలిపారు. మణిపూర్‌లో గిరిజన తెగలపై మారణహోమం కొనసాగుతుండగానే… ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో దళితులపై పట్టపగలు కాల్పులు జరుగుతుండడం అత్యంత దురదృష్టకరమన్నారు.

భీమ్ ఆర్మీ చీఫ్, దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ ప్రయాణిస్తున్న కారుపై ఆగంతకులు జరిపిన కాల్పుల ఘటన దేశమంతటా దళితులను ఉలిక్కిపడేలా చేసిందని చెప్పారు. దళిత నేతలపై జరుగుతున్న ఈ కాల్పులను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని, దేశవ్యాప్తంగా దళితులపై జరిగే దాడులు, అరాచకాలు, అవమానాలను తమ పార్టీ ఉపేక్షించదని వెల్లడించారు. దళితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

- Advertisement -

ఇదే ధర్నాకు భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) నేతలు కూడా సంఘీభావం ప్రకటించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ నేతృత్వంలో నేతల బృందం జంతర్ మంతర్ ధర్నాకు హాజరయ్యారు. మోదీ సర్కారు హయాంలో కుల, మత విద్వేషాలు పెచ్చుమీరాయని నారాయణ విమర్శించారు. దళితులు, గిరిజనులపై అరాచకాలు రోజూ బయటపడుతున్నాయని అన్నారు. అణచివేతకు గురవుతున్న దళిత, గిరిజన వర్గాలకు సీపీఐ అండగా ఉంటుందని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement