Sunday, May 5, 2024

అగ్నిపథ్ పై త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్ స‌మీక్ష‌

దేశ‌వ్యాప్తంగా అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. యువత, ఆర్మీ ఉద్యోగార్థులు రైల్వే స్టేషన్లే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆందోళనలు తగ్గకపోవడంతో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అగ్నిపథ్‌ విధివిధానాలపై మరోసారి చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం సైనిక విభాగాల అధిపతులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో బీహార్‌ రావణకాష్టంగా మారింది.

రాష్ట్రంలో గత 4 రోజులుగా జరుగుతున్న నిరసన కార్యాక్రమాల్లో ఏకంగా 60 రైళ్ల కోచ్‌లు, 11 ఇంజిన్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బీహార్‌లోనే భారతీయ రైల్వేకు రూ.700 కోట్లకుపైగా భారీ నష్టం సంభవించింది. శుక్రవారం సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లలో మూడు రైళ్లు కాలిపోయాయి. రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేశ్‌ అనే యువకుడు మృతిచెందిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement