Tuesday, May 28, 2024

రాగల మూడు రోజులు వర్షాలు.. ఆరుతడి పంటలకు ప్రాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దాదాపు 20 రోజులుగా సరిపడినంతస్థాయిలో వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న శుభవార్త చెెప్పారు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆంధ్ర్రపదేశ్‌ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, మయన్మార్‌, బంగ్లాదేశ్‌ వైపున కేంద్రీకృతమైన మేఘాలను తనవైపునకు ఆకర్షిస్తోందని, ఈ పరిణామంతో మేఘాలు తెలుగురాష్ట్రాలపై ఆవరిస్తాయని వివరించారు.

వీటి ప్రభావంతో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణకేంద్రం అంచనా వేస్తోంది. రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రాష్ట్రంలోని మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

అదేవిధంగా ఈ నెల 19న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొమరంభీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడా కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 20రోజులుగా చెప్పుకోదగినస్థాయిలో వర్షాలు కురవలేదు. సాధారణంగా వరితోపాటు ప్రధానంగా పత్తి, జొన్న, కంది, పెసర తదితర వర్షాధార, ఆరుతడి పంటలకు వర్షాకాలంలో క్రమం తప్పకుండా వర్షాలు కురవాలి. ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయి. ఆ రెండు నెలలు రైతులకు, పంటల ఎదుగుదలకు, పంటలు కాత, పూత పట్టేందుకు చాలా కీలకం. ముఖ్యంగా పత్తి చేలు పెరిగే కొద్దీ వర్షాలు అవసరం. ప్రస్తుతం పత్తి చేలు గూడకు రావాల్సిన సమయంలో వర్షాలు కురవకపోవడంతో అసలు మొక్కల ఎదుగదలనే లోపించింది.

ఈసారి జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. అయితే గత 15 రోజులుగా అక్కడక్కడా చెదురుమదురు జల్లులు తప్ప భారీ వర్షాలు కురవలేదు. దీంతో పత్తి, పెసర, జొన్న తదితర ఆరుతడి పంటలు వాడిపోయే దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ ప్రకటనతో ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement