Monday, May 6, 2024

8000 వందే భారత్‌ కోచ్‌ల తయారీ లక్ష్యంగా రైల్వే శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే కాలంలో మొత్తం 8000 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లను మరింతగా మెరుగుపరచేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. వందే భారత్‌ రైలు సౌకర్యవంతమైన ప్రయాణానికి, త్వరగా గమ్యస్థానం చేరుకోవడానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం వందే భారత్‌ రైళ్లు ప్రస్తుతం 16 కోచ్‌లతో నడుస్తున్నాయి. అయితే దీనిని అవసరాన్ని బట్టి 8 కోచ్‌లతో నడపవచ్చు. ప్రస్తుతం వందే భారత్‌ రైళ్లను దేశంలోని చాలా రాష్ట్రాలలో నడుపుతున్నారు.

కొన్ని సంవత్సరాలలో దేశంలోని మిగిలిన మార్గాల్లో కూడా వందే భారత్‌ రైళ్లను నడుపనున్నారు. 16 కోచ్‌ల వందే భారత్‌ రైలు సెట్‌ తయారు చేయడానికి దాదాపు రూ.130 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. చెన్నైలోని ఇంటగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ స్లీపర్‌ వేరియంట్‌లో 3200 భారత్‌ కోచ్‌లను తయారు చేయనుంది. ఇప్పటి వరకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం సీటింగ్‌ కోచ్‌లను మాత్రమే సిద్ధం చేశారు. ప్రణాళికాబద్ధమైన విస్తరణతో 1600 కోచ్‌లను ఐసీఎఫ్‌లో ఉత్పత్తి చేశారు. మిగిలినవి ఎంసిఎప్‌-రాయ్‌ బరేలీ, ఆర్‌సిఎఫ్‌ కపుర్తలా ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. వందేభారత్‌ కోచ్‌ల సంఖ్య కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 25 నుంచి 75కు చేరుతుందని భారతీయ రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

కాగా, రాబోయే కాలంలో మొత్తం 8000 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లను తయారు చేయనున్న ప్రణాళికలో భాగంగాఈ ఏడాది దాదాపు 700 కోచ్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వెయ్యి అదనపు కోచ్‌లను తయారు చేయనున్నారు. వందేభారత్‌ స్లీపర్‌ వేరియంట్‌లో మొదటి రైలు వచ్చే ఏడాది ప్రారంభంలో తయారు చేయనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ రైలును సుదూర రైళ్లలా నడపనున్నామనీ, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ మాదిరిగా 500 కి.మీ.ల దూరం నడుస్తుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement