Saturday, May 4, 2024

AP | రాష్ట్రంలో పెరిగిన వర్షపాతం.. అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ : అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వర్షపాతం పెరిగింది. జూలై నెలాఖరు నాటికి 131.1 మిమీ కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 151.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు, కృష్ణా శ్రీకాకుళం ,విశాఖపట్నం ,విజయనగరం జిల్లాల్లో అత్యధికంగాను, అనకాపల్లి, బాపట్ల , తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, ఎన్టీఆర్‌, పార్వతీపురం, చిత్తూరు జిల్లాల్లో అధికంగాను, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు, తిరుపతి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో సాధారణంగాను శ్రీసత్యసాయి, నంధ్యాల, అన్నమయ్య జిల్లాల్లో సాధారణం కంటే తక్కవ వర్షపాతం నమోదైంది.

అంచనాలు తారుమారు

- Advertisement -

ఈ ఏడాది రుతుపవనలు ఆలస్యం కావడంతో వర్షపాతం కూడా తగ్గుతోందని వాతావరణశాఖ అంచనా వేసింది. సాధారణంగా ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల ఆగమనం జూన్‌ 8వ తేదీన ఉంటుంది. 12వ తేదీ నాటికి రాష్ట్రం మొత్తం వ్యాపిస్తోంది. ఈ ఏడాది జూన్‌ 11న రుతుపవనాలు ప్రవేశించాయి. వారం రోజులు గడిచినప్పటికీ సగం కూడా విస్తరించడకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 19వ తేదీ తరువాత రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లో నెమ్మదిగా కదలడం ప్రారంభించాయి. జూన్‌ 27వ తేదీ నాటికి -25 మి.మీ వర్షపాతం ఉంది. జూలై నెల ప్రారంభంలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు.

ఈక్రమంలో ఈనెల 15వ తేదీ నాటికి కూడా 13 జిల్లాల్లో సాధారణం కంటే తక్కవ వర్షపాతం నమోదైంది. రుతుపవనాలు మొహం చాటేయడంతో జూన్‌ 20వ తేదీ వరకు ఎండలు దంచికొట్టాయి. మున్నెన్నడూ లేని విధంగా జూన్‌ నెలలో కూడా 44 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నలభై ఏళ్ళలో నెలవారీగా పరిశీలిస్తే 2023 ఏప్రిల్‌లో సముద్ర జలాల సగటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా 21 డిగ్రీలు దాటినట్లు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడంతో ఎల్నినో ఏర్పాడి జూన్‌ నెలలో నైరుతు రుతుపవనాల విస్తరణ ఆలస్యం అయిందని దీనివల్లే జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదని వాతావరణ శాస్త్రజ్ఞలు పేర్కొన్నారు.

రాష్ట్రంలో సగటు వర్షపాతం 574.8 మీమీ ఉండాలి. గతేడాది583.2 మిమీ నమోదైంది. ఈ ఏడాది వర్షపాతం తగ్గుతోందని వాతావరణ శాఖ అంచనాలను తారుమారు చేస్తూ వర్షాలు ఈనెల మూడు వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వానలు దంచికొట్టాయి. కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

లోటు తీరింది

జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షకాలం ఉంటుంది. ఇప్పటి వరకు నమోదైన జూన్‌లో ఆశించిన మేర వర్షాలు కురవనప్పటికీ జూలైలో కురిసిన భారీ వర్షాలతో వర్షపాతం లోటు తీరింది. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో చెరవులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. భూగర్భజలాల్లో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన నాలుగేళ్ళుగా విస్తారంగా వర్షాలు కురవడంతో వ్యవసాయం పండగలా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో వర్షాలు మొహం చాటేయడంతో వ్యవసాయం ప్రశ్నార్ధకంగా మారడంతో అన్నదాతలు బెంగపడ్డారు. తాజా వాతావరణ పరిస్థితుల మార్పుల నేపథ్యంలో జోరు వానలు కురవడంతో రైతన్నలు సంబరపడుతున్నారు. ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లోకూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినట్లైతే ఈ ఏడాదికి గట్టెక్కినట్లైనని రైతులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement