Tuesday, May 21, 2024

Exclusive | అమేథీ బరిలో రాహుల్​.. స్మృతి ఇరానీపై పోటీకి సై!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆ రాష్ట్రంలో గెలిస్తే ఢిల్లీ పీఠాన్ని గెలుచుకోవచ్చు అన్నది దేశ రాజకీయాల్లో ఉత్తర్ ప్రదేశ్ విషయంలో ఉన్న సామెత. దేశంలోనే అత్యధిక జనాభా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ జనాభా కలిగి ఉత్తర్ ప్రదేశ్‌కు దేశ రాజకీయాల్లో అంత ప్రాధాన్యత ఉంది. ఉత్తరాఖండ్ వేరుపడ్డ తర్వాత కూడా 80 పార్లమెంట్ స్థానాలతో ఆ రాష్ట్రం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించడంలో ఈ రాష్ట్రానిదే సింహభాగం.

కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడం వెనుక కూడా ఈ రాష్ట్రంలో బలహీనపడడమే ప్రధాన కారణం. 2024లో ఎలాగైనా మోదీ సర్కారును గద్దె దించి అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్‌లో పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో రాహుల్ గాంధీ అమేథీ నుంచి మరోసారి పోటీ చేయడానికి సిద్ధమవగా.. ఈసారి ప్రియాంకను సైతం ఎన్నికల రాజకీయాల్లోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే యూపీ ఇంచార్జిగా ఆమె రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు.

- Advertisement -

పోయినచోటే వెతుక్కోవాలి

కాంగ్రెస్ కంచుకోటగా.. గాంధీ కుటుంబాన్ని తరాలుగా ఆదరిస్తూ వస్తున్న రాయ్‌బరేలీ – అమేథీ ప్రాంతం 2019లో ఆ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చింది. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ గెలిచినప్పటికీ.. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు. ఆయనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గెలుపొందారు. బీజేపీ సాధించిన 303 సీట్లలో ఈ సీటు కూడా చేరింది. ఈసారి బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. మరీ ముఖ్యంగా తాను ఓడిన చోటే మళ్లీ గెలిచి నిరూపించుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అందుకే ఈసారి కూడా అమేథీలో మళ్లీ పోటీచేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. యూపీసీసీ ఈ విషయాన్ని ఇప్పటికీ ధృవీకరించింది. యూపీసీసీ అధ్యక్షులు అజయ్ రాయ్ ఈ విషయాన్ని ప్రకటించడమే కాదు, ప్రియాంక కోరుకుంటే ఆమె కోసం వారణాసిలో ప్రతి కార్యకర్త పనిచేస్తారంటూ వ్యాఖ్యానించారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసిలో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీపై వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు.

కానీ ఆయన చూపిన పోరాట పటిమ పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీకి అజయ్ రాయ్ ఇష్ట నేతగా మారారు. అందుకే ఆయనకు యూపీసీసీ పగ్గాలు పార్టీ అప్పగించింది. అజయ్ రాయ్ ప్రకటన సంగతి ఎలా ఉన్నా.. రాహుల్ మదిలోనూ ఇదే ఆలోచన ఉన్నట్టుగా తెలిసింది. పోయినచోటే వెతుక్కోవాలి అన్న సామెత మాదిరిగా.. ఓడినచోట గెలిచి స్మృతి ఇరానీతో పాటు భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాలనే కసితో ఉన్నట్టుగా కనిపిస్తోంది.  

యూపీ కాంగ్రెస్‌ పునర్వ్యవస్థీకరణ

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ కసరత్తు చేపట్టింది. పార్టీని సంస్థాగత పునర్వ్యవస్థీకరిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) అధ్యక్ష బాధ్యతలను బ్రిజ్‌లాల్ ఖబ్రీ చేతి నుంచి మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్‌కు అప్పగించింది. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో యూపీసీసీ చీఫ్‌గా ఖబ్రీ బాధ్యతలు చేపట్టారు.

మూడు దశాబ్దాలుగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో ఉన్న ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైన కొద్ది నెలల తర్వాత ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకం వార్తను పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే పార్టీ అధిష్టానం అధ్యక్ష బాధ్యతల్లో మార్పుతో పాటు సంస్థాగతంగా మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది.

రాహుల్ గాంధీకి అజయ్ రాయ్ నమ్మిన బంటు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాయ్‌ను అత్యున్నత పదవిలో కూర్చోబెట్టాలనే నిర్ణయం పార్టీలో ఆయన స్థాయిని పెంచడంతో పాటు కార్యకర్తల్లో కూడా నూతనోత్సాహాన్ని కల్గించింది. రాయ్ నియామకంలో రాహుల్ గాంధీ ముఖ్యమైన పాత్ర పోషించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అజయ్ రాయ్ పూర్వాంచల్ ప్రాంతంలో గట్టిపట్టు కలిగిన నేత. నరేంద్ర మోదీపై పోటీ కారణంగా ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఆయనకు భూమిహార్‌ వర్గాల్లోనే కాకుండా బ్రాహ్మణులు, ఇతర కులాల్లో కూడా మంచి పట్టు ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement