Monday, April 29, 2024

Delhi: రబీ సీజన్​లో ఎరువుల సబ్సిడీ.. 51,875 కోట్ల విలువైన సబ్సిడీకి కేంద్ర‌ కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రబీ సీజన్‌లో ఎరువుల సబ్సిడీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ 2022 అక్టోబర్ 1 నుంచి 2023 మార్చి 31 వరకూ ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై పోషకాధారిత సబ్సిడీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ఖజానాపై రూ.51,875 కోట్ల మేర ఆర్థికభారం పడుతుందని అంచనా వేసింది. ఎరువులపై సూక్ష్మ పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్‌) పరిమితికి ఆమోదం తెలపడం ద్వారా నత్రజని (ఎన్‌), భాస్వరం (పి), పొటాష్ (కె), గంధకం (ఎస్‌) సూక్ష్మ పోషక ఎరువులకుగాను కిలోగ్రాముకు వర్తించే సబ్సిడీపై కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన రేట్లకు ఆమోదముద్ర వేసింది.

ఈ నిర్ణయంతో 2022-23 రబీలో రైతులకు ‘పి అండ్‌ కె’ ఎరువులన్నీ సబ్సిడీ లేదా సరసమైన ధరలకు లభిస్తాయి. తద్వారా వ్యవసాయ రంగానికి చేయూతనందించినట్టవుతుంది. ఎరువులు, రసాయన ముడి పదార్థాల అంతర్జాతీయ ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ, ఆ భారం రైతులపై పడకుండా కేంద్రమే భరిస్తుంది. మొత్తంగా దేశంలోని ఎరువుల తయారీ, దిగుమతిదారుల ద్వారా రైతులకు సబ్సిడీ ధరతో యూరియా సహా 25 గ్రేడ్‌ల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది.

వీటిలో ‘పి అండ్‌ కె’ ఎరువులపై సబ్సిడీని 2010 నుంచి ‘ఎన్‌బీఎస్‌’ పథకం కింద పర్యవేక్షిస్తోంది. ఎరువులు, ఉత్పాదక సరంజామా.. అంటే- యూరియా, డిఎపి, ఎంఓపి, సల్ఫర్‌ల అంతర్జాతీయ ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో రైతులపై భారం పడుతుంది. అయితే ‘డిఎపి’ సహా ‘పి అండ్ కె’ ఎరువులపై సబ్సిడీ పెంపు ద్వారా ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది.

డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌కు ఆమోదం
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్‌లోని హోలోంగీ గ్రీన్ ఫీల్డ్ ఎయర్‌పోర్టుకు ‘‘డోనీ పోలో ఎయర్ పోర్ట్, ఈటానగర్’’గా నామకరణం చేస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అరుణాచల్ రాష్ట్ర ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజించే సూర్యచంద్రుల పేర్ల మీదుగా ఈ విమానాశ్రయానికి ఆ పేరును పెట్టినట్టు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. సూర్యుడు (డోనీ), చంద్రుడు (పోలో) పేర్లను కలుపుతూ రాష్ట్ర సంప్రదాయాలకు, సాంస్కృతికం సంపన్న వారసత్వాని ప్రతీకాత్మకంగా ఉండేలా ఈ పేరును నిర్ణయించినట్టు మంత్రివర్గం తెలిపింది.

- Advertisement -

హోలోంగిలో ఒక కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వం 2019 జనవరిలో ‘సూత్ర ప్రాయ ఆమోదాన్ని’ తెలిపింది. ఈ ప్రాజెక్టు ను ఎయర్ పోర్ట్స్ ఆథారిటి ఆఫ్ ఇండియా (ఎఎఐ) రూ. 646 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement