Monday, April 29, 2024

Big Story | కారు స్పీడ్‌కు బ్రేకులువేసేలా.. కాంగ్రెస్‌ వ్యూహం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారిచింది. ప్రధానంగా బీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్లాన్‌ రెడీ చేస్తోంది. డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. అధికార బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రచార వ్యూహాలు, నియోజక వర్గాల వారీగా సర్వేలు, బీఆర్‌ఎస్‌ పార్టీపై ఎదురుదాడి, అభ్యర్థుల ఎంపికలపైన హస్తం ఫోకస్​ పెట్టింది.

ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతో ఇప్పటి వరకు పార్టీ చేసిన కార్యక్రమాలను ఇంటింటికి చేర్చేందుకు కాంగ్రెస్‌ శ్రేణులతో సహా అనుబంధ విభాలను పూర్తిస్థాయిలో మోహరించాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి పనులు, డిక్లరేషన్లలో పొందుపర్చిన అంశాలను ప్రజల్లోకి విస్తృతం చేయనున్నారు. నిరుద్యగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, భూ అక్రమణలు, ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించనున్నారు.

వడ్డీ మాఫీ కూడా చేయాలి..

గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు.. అమలు కానీ అంశాలను ప్రజలకు వివరించి ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇప్పటీ వరకు చేయకపోగా.. ఎన్నికల ముందు ఓట్ల కోసం రైతు రుణమాఫీ చేస్తామని చెబుతున్న అంశాన్ని తిప్పికొట్టాలనే యోచిస్తున్నారు. రైతు రుణమాఫీ ఆలస్యం కావడం వల్ల.. ప్రభుత్వం ఇచ్చే రూ.లక్ష వడ్డీలకే సరిపోతందని, వడ్డీతో సహా చెల్లించాలనే డిమాండ్‌తో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దళిత బంధుతో పాటు బీసీ బంధు పూర్తిగా అమలు చేయాలని ఆయా వర్గాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే యోచనలో హస్తం పార్టీ నాయకులున్నారు.

- Advertisement -

అభ్యర్థుల ఎంపికలో మూడంచల వడపోత..

అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహారించాలనే నిర్ణయానికి వచ్చారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీని ధీటుగా ఎదుర్కొనే వారు ఉండాలనే అభిప్రాయంతో ఉన్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అభ్యర్థుల ఎంపికపై పారదర్శక విధానాన్ని అనుసరించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దీంతో మూడంచల వడపోత ప్రక్రియను అనుసరించనుంది. ప్రధానంగా మొదటి దశలో నియోజక వర్గాల వారీగా ఆశావాహుల నుంచి దరఖాస్తులను తీసుకుంటారు. పోటీ చేసే వారిని నుంచి దరఖాస్తుల స్వీకరణ, సునీల్‌ కనుగోలు బృందంతో పాటు పీసీసీ సర్వే నివేదికల ఆధారంగా ప్రజాదరణ కలిగిన నేతల జాబితాను తయారు చేసి.. ఆ నివేదికను పార్టీ అధిష్టానానికి నివేదించనున్నారు. అనంతరం పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీకి అందజేస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) తుది నిర్ణయం తీసుకని అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు 40 నుంచి 50 చోట్ల వివాదం లేకుండా ఒక్క అభ్యర్థే పోటీలో ఉన్నట్లుగా పీసీసీ అంచనా వేస్తోంది. అయితే వారిని సర్వేల అధారంగా ముందే ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పోటీకి పెరుగుతున్న ఆశావాహులు..

మరోవైపు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న అసెంబ్లిd ఎన్నికలపై కాంగ్రెస్‌ అధిష్టానం ఫోకస్‌ పెట్టింది. హస్తం పార్టీకి జనాల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుండటంతో .. పార్టీ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గం మినహా రాష్ట్రంలో మిగిలిన 16 పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో పోటీకి పెద్ద సంఖ్యలో ఆశావాహులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆశావాహులు సంఖ్య భవిష్యత్తులోనూ మరింతగా పెరిగే అవకాశం ఉందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లి నియోజక వర్గాల్లో పోటీ చేసినా.. గెలుస్తామనే ఆశలు పెట్టుకోవడం లేదు. ఇక్కడ మొదటి నుంచి మజ్లిస్‌ పార్టీ హవానే ఉంటుందని, పోటీ అనేది నామమాత్రంగానే ఉంటుందనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement