Saturday, May 18, 2024

Punishment – మ‌హిళా ఐపిఎస్ కు వేధింపులు – మాజీ అడిష‌న‌ల్ డిజిపికి మూడేళ్ల జైలు..

చెన్నై: లైంగిక ఆరోపణల కేసులో తమిళనాడు మాజీ అదనపు డీజీపీ రాజేష్‌ దాస్‌ను స్థానిక న్యాయస్థానం దోషిగా తేల్చింది.
ఓ మహిళా ఐపిఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఇక్కడి విల్లుపురం కోర్టు ఆయనకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ.10 వేల జరిమానా కూడా వేసింది. దీనిపై ఆయన అప్పీలుకు వెళ్లడంతోపాటు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తీర్పులో పేర్కొంది.

వివ‌రాల‌లోకి వెళితే ఐపీఎస్‌ అధికారి రాజేష్‌ దాస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ మహిళా ఐపీఎస్‌ 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. పళనిస్వామి సభకు బందోబస్తు నిర్వహించేందుకు వాహనంలో వెళ్తున్న సమయంలో సీనియర్‌ ఐపీఎస్‌ తనను లైంగికంగా వేధించాడని అందులో పేర్కొన్నారు. దీనిపై చర్యలు చేపట్టిన అన్నాడీఎంకే ప్రభుత్వం.. రాజేష్‌ దాస్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణ జరిపించింది.

ఐపీఎస్‌ అధికారి లైంగిక వేధింపుల అంశం 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారాస్త్రంగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్‌ అధికారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఎంకే స్టాలిన్‌ హామీ ఇచ్చారు. మరోవైపు ఈ కేసును అప్పట్లో మద్రాస్‌ హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. డీజీపీ స్థాయి వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న మహిళా ఐపీఎస్‌ను మరో అధికారి అడ్డుకోవడం షాక్‌కు గురిచేస్తోందని అభిప్రాయపడింది. ఈ కేసు దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఇప్పుడు తాజాగా ఈ కేసులో తీర్పు ఇస్తూ దాస్ కి మూడేళ్ల జైలు శిక్ష‌, 10వేలు జ‌రిమానా వేధించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement