Thursday, May 2, 2024

సామాన్యుడికి ధరల దెబ్బ, పెరిగిన ముడి సరుకుల ధరలు.. గరిష్ట స్థాయిలో ద్రవ్యోల్బణం

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావంతో పాటు దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతోనే.. తమ ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వస్తున్నదని చెబుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందుస్థాన్‌ యూనీలివర్‌ (హెచ్‌యూఎల్‌) తమ ఉత్పత్తుల ధరలను ఏకంగా 15 శాతం వరకు పెంచేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న ద్రవ్యోల్బణ పరిస్థితులను గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని కంపెనీ సీఈఓ, ఎండీ సంజీవ్‌ మెహతా తెలిపారు.

రానున్న కాలంలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు ఉన్నట్టు ఆయన అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని కంపెనీలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వడ్డీ రేట్లను 40 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడం పరిస్థితులకు అద్దంపడుతున్నదని వివరించారు. రిటైల్‌, హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, సంస్థలు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నాయని వివరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వస్తువుల ధరలను పెంచాల్సి వస్తున్నదని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం భారత్‌పై కూడా ఉందని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement