Friday, May 10, 2024

Delhi | కేసీ వేణుగోపాల్‌తో పొన్నాల భేటీ.. జనగామ డీసీసీ అధ్యక్ష నియామకంపై ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జనగామ డీసీసీ అధ్యక్ష నియామకం సహా పార్టీలో ఓబీసీలకు ప్రాధాన్యత లేదంటూ అసమ్మతిరాగం వినిపిస్తున్న తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. వారం రోజులకు పైగా ఢిల్లీలోనే నిరీక్షించిన ఆయన, బుధవారం మధ్యాహ్నం కేసీ వేణుగోపాల్‌ను కలిసి రాష్ట్రంలోని తాజా పరిస్థితుల గురించి వివరించినట్టు తెలిసింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులిగా కొమ్మూరి ప్రతాప రెడ్డి నియామక ఉత్తర్వులు వెలువడ్డ వెంటనే ఢిల్లీ వచ్చిన పొన్నాల తొలుత ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలిసి వివరించే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో విషయాన్ని కేసీ వేణుగోపాల్‌తో చర్చించాల్సిందిగా రాహుల్ గాంధీ సూచించారు. ఆ మేరకు బుధవారం కేసీ వేణుగోపాల్‌ను కలిసి జనగామ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో పీసీసీ నాయకత్వం అధిష్టానాన్ని ఎలా తప్పుదారి పట్టించిందో వివరించినట్టు తెలిసింది. ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన కొమ్మూరి ప్రతాప రెడ్డిని సుదీర్ఘకాలం పార్టీకి సేవలు అందించిన వ్యక్తిగా పేర్కొంటూ సిఫార్సు చేయడాన్ని పొన్నాల గతంలోనే తీవ్రంగా తప్పుబట్టారు. జనగామ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ ఢిల్లీ వచ్చి మరీ మీడియాతో మాట్లాడుతూ కొమ్మూరి నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా జనగామ కాంగ్రెస్ నేతల పేరుతో ఓ లేఖ పార్టీలో కలకలం సృష్టించింది.

అందులో పేర్కొన్న అంశాల ప్రకారం.. కొమ్మూరి ప్రతాప రెడ్డితో పాటు మరో రెండు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం విషయంలో పీసీసీ నాయకత్వం అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించింది. దశాబ్దాలుగా పార్టీకి విలువైన సమయాన్ని అందించారని పేర్కొనడం పూర్తిగా అవాస్తవమని ఆ లేఖ చెబతోంది. ముఖ్యంగా కొమ్మూరి ప్రతాప రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేపీ సహా మొత్తం నాలుగు పార్టీలు మారిన తర్వాత 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారని పేర్కొంది. మిగతా రెండు జిల్లాల అధ్యక్షులు సైతం కాంగ్రెస్‌లో కొత్తగా చేరినవారే అని లేఖరాసిన నేతలు పేర్కొన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం డీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యేవారు అదే జిల్లాకు చెందిన స్థానికులై ఉండాలని, కానీ కొమ్మూరి ప్రతాప రెడ్డి సిద్దిపేట జిల్లాకు చెందినవారని తెలిపారు. స్థానికేతరుడు, పార్టీలు మారి వచ్చిన కొమ్మూరి ప్రతాప రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం వల్ల జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు నైరాశ్యానికి లోనయ్యారని వెల్లడించారు. ఈ అంశాలన్నీ కేసీ వేణుగోపాల్‌తో జరిగిన సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ విషయాలు తెలుసుకున్న కేసీ వేణుగోపాల్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం.

మరోవైపు పార్టీలో బీసీ నేతలకు ప్రాధాన్యత ఉండడం లేదని కూడా పొన్నాల చెప్పినట్టు తెలిసింది. 1983 నుంచి తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ సగం సీట్లను దాటి గెలుచుకోలేకపోయిందని, మూడు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ గెలుపొందిన సీట్లు సగం కంటే తక్కువేనని పొన్నాల చెప్పారు. ఇందుకు కారణంగా తెలంగాణ ప్రాంతంలోని బీసీలు కాంగ్రెస్‌ పార్టీలో తాము నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నామన్న భావనేనని చెప్పారు.

పార్టీకి దూరమైన బీసీలకు అక్కున చేర్చుకోవాల్సిందిపోయి ఎన్నికల సమయంలో పేరుకు కొన్ని సీట్లు ఇచ్చి కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకునే ప్రయత్నం చేస్తే ఎలా నమ్ముతారని పొన్నాల ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీ ప్రక్రియలో బీసీ నేతల అభిప్రాయాలకు చోటు లేకపోగా, కనీసం తమ అభిప్రాయాలు చెప్పేందుకు కూడా ఆస్కారం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement