Saturday, May 18, 2024

ఖాకీల్లో క‌ద‌లిక.. గుట్కా , గంజాయి విక్ర‌య‌దారుల‌పై కొరడా ఝుళిపిస్తున్న పోలీసులు..

మహబూబ్‌నగర్, ప్రభన్యూస్ : మహబూ బ్‌నగర్‌ జిల్లాలో గుట్కా, గంజాయి విక్రయాలు, రవాణాపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిషేధిత గుట్కా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో కిరాణం దుకాణాల నుంచి, పట్టణ ప్రాంతాల్లో పాన్‌షాపుల వరకు నిషేధిత గుట్కా ప్యాకెట్లు యథేచ్ఛగా లభ్యమవుతున్నాయి. దీనికితోడు పట్టణ కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో పలువురు రైతులు గంజాయిని సాగుచేస్తూ గంజాయి మాఫియా దారుల ద్వారా విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే గంజాయి, గుట్కా విక్రయాలపై ఉక్కపాదం మోపాలని సీఎం కేసీఆర్‌ పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ జి ల్లా పోలీసులు నామమాత్రపు దాడులతో సరిపెట్టారు. ఈక్రమంలో జిల్లాలో నిషేధిత గుట్కా, గంజాయి విక్రయాలు, రవాణాను అరికట్టడంలో కదలిక వచ్చింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని కిరాణం, పాన్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తూ గుట్కా విక్రయాలు చేయొద్దంటూ అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస దాడులు నిర్వహిస్తూ, పల్లెలు, మండల, పట్టణ కేంద్రాల్లో గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని, విక్రయాలు చేసే వారి సమాచారం ఇవ్వాలంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

రైతు బంధు నిలిపివేత..

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పలువురు రైతులు రహస్యంగా గంజాయిని సాగుచేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే గతంలో పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది దాడులు నిర్వహించి గంజాయి సాగుచేస్తున్న రైతులపై కేసులు నమోదు చేశారు. తాజాగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగు చేయొద్దంటూ విస్తృత ప్రచారం కల్పిస్తున్న ఖాకీలు.. సాగుదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ మండల పరిధిలోని చంద్రప్ప అనే రైతు పొలంలో గతంలో గంజాయి సాగు చేయగా.. ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. తాజాగా అతనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అతని రైతు బంధును నిలిపివేయాలంటూ కలెక్టర్‌ వ్యవసాయశాఖకు ఆదేశాలివ్వడంతో అధికారులు రైతుబంధు నిలిపివేశారు. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు రైతుల రైతుబంధును నిలిపివేశారు. ఇలా ప్రస్తుతం గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన రైతులకు, గతంలో పట్టుబడిన రైతులకు ప్రభుత్వం ప్రతియేటా రెండు దఫాలుగా విడుదల చేస్తున్న రైతు బంధు పథకాన్ని నిలిపివేస్తున్నారు.

గుట్కా విక్రయాలను అరికట్టేలా..

2021 సంవత్సరంలో గుట్కా విక్రయిస్తున్న 132 మందిపై కేసులు నమోదు చేసి 147 మందిని అరెస్టు చేశారు. 2022 జనవరిలో గుట్కా విక్రయాలు చేస్తున్న 17 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లా ఎస్పీ సూచనలతో పోలీసులు గుట్కా విక్రయాలు, రవాణాపై పటిష్ఠ నిఘా పెట్టారు. కిరాణం దుకాణాలు, పాన్‌షాపుల యాజమానుల్లో గుట్కా విక్రయాలు చేయొద్దంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ పట్టణ కేంద్రంలో పాన్‌షాపుల్లో నిషేధిత గుట్కా విక్రయాలు చేయమంటూ యాజమానులు తీర్మానం చేశారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ గుట్కా విక్రయాలు, రవాణా జరగ కుండా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయినా పలు వురు పోలీస్‌ సిబ్బంది సహకారంతో గుట్టుచప్పుడు కా కుండా గుట్కామాఫియా తమ వ్యాపారాన్ని కొనసాగి స్తున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రాంతాల నుంచి నిషేధిత గుట్కా ప్యాకెట్లను గుట్టుచప్పుడు దుకాణాలకు చేరవేస్తూ విక్రయాలు చేస్తున్నారు. ఖాకీలు నిర్లక్ష్యం వహించకుండా దాడులు మరింత ముమ్మరం చేస్తే నిషేధిత గుట్కా విక్రయాలు పూర్తిగా అరికట్టవచ్చని, ఆమేరకు పోలీస్‌శాఖ దృష్టిసారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement