Saturday, May 4, 2024

Delhi | ఏపీకి పీఎంవో ప్రత్యేక ప్యాకేజి.. ఎన్నికల ఏడాది పొలిటికల్ స్ట్రాటజీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మరో ఏడాదిలో ఏకకాలంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోనున్న ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట కల్పించే ప్యాకేజి సిద్ధం చేసింది. ఇందులో తొమ్మిదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ లోటు భర్తీ నిధుల కింద రూ. 10,460.87 కోట్లు విడుదల చేసిన కేంద్రం, త్వరలో పోలవరం ప్రాజెక్టుకు సుమారు రూ. 13 వేల కోట్లు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో పాటు రుణ పరిమితిలో విధించిన కోతలో కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించడంతో సుమారు రూ.5.5 వేల కోట్ల రుణం పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందింది.

ఇలా మొత్తంగా రూ. 28,704.02 కోట్ల మేర ప్రయోజనాలను ఎన్నికల ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించింది. పదే పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుతున్న అభ్యర్థనల మేరకు ప్రధాని కార్యాలయం 2022 జనవరి 10న కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు అంశాలను ఖరారు చేసి, వాటిని పరిష్కరించే క్రమంలో సాధారణ పరిస్థితుల్లో సాధ్యం కానప్పటికీ ప్రత్యేక దృష్టితో సానుకూలంగా వ్యవహరించింది. ఆ కమిటీ ఖరారు చేసిన అంశాల్లో మొదటిది రెవెన్యూ లోటు కాగా రెండవది రుణ పరిమితి, మూడవది పోలవరం ప్రాజెక్టుకు నిధులు.

రెవెన్యూ లోటు – మారిన లెక్క

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 16,078 కోట్ల మేర రెవెన్యూ లోటు ఉందని కాగ్ సహా నాటి ప్రభుత్వం లెక్కించింది. ఆ నిధులు విడుదల చేయాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే అడుగుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 46(2) ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు ఉద్దేశించిన రూ. 1,500 కోట్లు సహా మొత్తం రూ. 5,617.89 కోట్లు విడుదల చేసింది. ఇక అంతకు మించి విడుదల చేయాల్సిందేమీ లేదని, రాష్ట్ర విభజన తర్వాత రూపొందించిన పీఆర్సీ బకాయిలు, పెన్షన్ల పెంపు వంటి అంశాలను రెవెన్యూ లోటు కింద లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది. కానీ ఈ అంశంపై మనసు మార్చుకున్న కేంద్రం ప్రత్యేక కేసుగా పరిణగిస్తూ మొదట చెప్పిన లెక్కను పరిగణలోకి తీసుకుని ఈ మధ్యనే మిగిలిన రూ. 10,460.87 కోట్లు విడుదల చేసింది.

- Advertisement -

రుణ పరిమితిలో కోత – వెసులుబాటు

దేశంలో ఏ రాష్ట్రమైనా ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి లోబడి రుణాలు చేయాల్సి ఉంటుంది. అయితే 2016-17 నుంచి 2020-21 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రుణ పరిమితికి మించి రూ. 17,923.94 కోట్లు అదనంగా రుణాలు చేసినట్టు కేంద్రం గుర్తించింది. ఈ అదనపు రుణాన్ని తదుపరి ఏడాది రుణ పరిమితి నుంచి ఒకేసారి మినహాయించకుండా మూడేళ్ల పాటు కోత విధించేలా ఏర్పాటు చేసింది. తద్వారా ఆ రాష్ట్రానికి ఆర్థికంగా ఒకేసారి ఇబ్బంది ఏర్పడకుండా చేయాలని భావించింది. ఆ మేరకు 2021-22లో రూ. 3,923.94 కోట్లు, 2022-23లో రూ. 6,000 కోట్లు 2023-24లో రూ. 8,000 కోట్లు కోత విధించేలా లెక్కలు నిర్ణయించింది.

అయితే ఎన్నికల ఏడాది రూ. 8,000 కోట్ల మేర కోత విధించకుండా వాయిదా పద్ధతిలో కోత విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి అభ్యర్థనను అంగీకరించే ప్రసక్తే ఉండదు. కానీ కేంద్రం ఈ అంశంలోనూ ప్రత్యేక కేసుగా పరిగణించి ఈ ఆర్థిక సంవత్సరం రుణ పరిమితిలో కోత పడాల్సిన రూ. 8,000 కోట్లను 3 విడతల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. 2023-24 నుంచి 2025-26 వరకు మరో మూడేళ్ల పాటు రూ. 8,000 కోట్లను 3 భాగాలుగా చేసి ఈ ఏడాది రూ. 2,666.67 కోట్లు మాత్రమే రుణ పరిమితి నుంచి కోత విధించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన ఈ ప్రత్యేక వెసులుబాటుతో ఎన్నికల ఏడాది అదనంగా రూ. 5,332 కోట్ల మేర రుణం తీసుకునే అవకాశం ఏపీ ప్రభుత్వానికి కలిగింది.

పోలవరం – పాత అంచనాలకే అదనపు నిధులు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2014 తర్వాత నుంచి అయ్యే ఖర్ఛు (ఇరిగేషన్ కాంపోనెంట్)ను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. ఆ మేరకు 2017 మార్చి 15న సమావేశమైన కేంద్ర కేబినెట్ 013-14 నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు ఇరిగేషన్ కాంపోనెంట్ ఖర్చు రూ. 20,398.61 కోట్లుగా లెక్కించింది. ఇందులో 2014 కంటే ముందు రూ. 4,730.71 కోట్లు ఖర్చు చేయగా.. మిగిలిన మొత్తం రూ. 15,667.90 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉంటుందని తేల్చింది. అయితే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందున ప్రాజెక్టు కోసం ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి బిల్లులు పంపితే, వాటిని రీయింబర్స్ చేస్తూ వస్తోంది.

అలా ఇప్పటి వరకు రూ. 14,418.39 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. ఇంకా రూ. 1,249.50 మాత్రమే చెల్లించాల్సి ఉందని తేల్చింది. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో సవరించిన అంచనాలను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని కోరుతోంది. సవరించిన అంచనాలను ఆమోదించకుండానే ప్రస్తుతం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎంత మొత్తంలో నిధులు అవసరమవుతాయన్నది కేంద్రం లెక్కగట్టింది. పోలవరం ప్రాజెక్టును తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తే ఇంకా రూ. 10,911.15 కోట్లు అవసరమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది.

ఈ ఎత్తు వద్ద ముంపు ప్రాంతం తక్కువగా ఉంటుందని, ఫలితంగా భూసేకరణ, నిర్వాసిత గ్రామాలు, పరిహారం, పునరావాసం కోసం అయ్యే ఖర్చు అన్నీ తగ్గుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ప్రాజెక్టు ఎత్తు పెరిగే కొద్దీ ముంపు ప్రాంతం పెరిగి ముంపు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు కూడా పెరుగుతాయని భావించాయి. తదుపరి ప్రాజెక్టు ఎత్తు పెంచుకునే వెసులుబాటును ఉంచుతూనే తొలి దశలో ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మించి, గ్రావిటీ ప్రకారం కుడి, ఎడమ కాలువల్లోకి నీటిని విడుదల చేయవచ్చని కూడా నిపుణులు సూచించినట్టు తెలిసింది.

దీంతో ఈ ఎత్తు వద్ద ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమయ్యే సొమ్ముకు తోడు ఈ మధ్య వచ్చిన భారీ వరదల కారణంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో దెబ్బతిన్న భాగాల మరమ్మత్తుకు రూ. 2,000 కోట్లు అవసరమవుతాయని, వాటిని కూడా కేంద్రం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం రిపేర్ ఖర్చుతో కలుపుకుని మొత్తం రూ. 12,911.15 కోట్లు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ మొత్తం విడుదల చేయాలంటే గతంలో తీసుకున్న కేంద్ర కేబినెట్ నిర్ణయంలో సవరణలు చేస్తూ మరోసారి కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కేబినెట్ నోట్ తయారు చేసి పంపితే కేబినెట్ ఆమోదముద్ర వేసేందుకు సిద్ధంగా ఉంది.

ఈ మూడు అంశాలను పరిష్కరించడం ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏపీలో తమపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవాలని చూస్తోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అనేక విద్యా సంస్థలతో పాటు ప్రత్యేకంగా అందించిన సహాయం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. చాలా వరకు కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత పథకాలుగా రంగులు వేసి ప్రచారం చేసుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాటి గురించి కూడా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని కమలనాథులు చూస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement