Sunday, May 5, 2024

పత్తి పంటకు తెగుళ్ల దెబ్బ.. తలమాడు, గులాబీ పురుగుల దాడి

తలమాడు తెగులు పత్తి పంటను పీల్చి పిప్పి చేస్తోంది. క్వింటాకు సుమారు రూ.2 వేల థర అమాంతం పడిపోవటానికి ఈ తెగులే ప్రధాన కారణం. తొలికాపులో నాణ్యమైన పంట చేతికందింది. మార్కెట్లో క్వింటాకు రూ 8 వేల దాకా ధర పలకటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అంతలోనే వారి ఆశలను ఆవిరి చేస్తూ తలమాడు తెగులు సోకింది. దీనికి గులాబీ రంగు పురుగు కూడా జతకలిసింది. మార్కెట్‌ ధరలపైనే కాకుండా దిగుబడి, పంట నాణ్యతపై కూడా తెగులు ప్రబావం చూపిస్తోంది.. తొలిదశలో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రాగా ఇపుడు సగానికి సగం తగ్గిపోయే ప్రమాదం కనబడు తోందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలో సాగు చేసిన పత్తి దిగుబడులు ఇపుడు చేతికందుతుండగా.. జూన్‌, జులైలో సాగు చేసిన పంట పూత దశలో ఉంది.

ఎన్ని మందులు చల్లినా గులాబీరంగు మాయమైనట్టే కనిపించి మళ్లీ కనబడుతోంది..తలమాడు తెగులు నివారణ అసలు సాధ్యం కావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటకు ఇపుడు వాతావరణం ప్రతికూలంగా మారటం, గడిచిన రెండు మూడు నెలలుగా మధ్యాహ్న వేళల్లో ఎండ తీవ్రత సాధారణం కన్నా అధికంగా ఉండటంతో రసం పీల్చే గులాబీ రంగు పురుగు వ్యాపిస్తోందనీ, పొలం గట్లపై వయ్యారిభామగా పిలిచే పార్థీనియం మొక్కలు, తుత్తర బెండ అధికంగా ఉండటంతో తామర పురుగు లు చేరటం..వాటి ద్వారా పంటకు తలమాడు తెగులు సోకుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లాంఫాం సూచనలు..

పత్తికి సోకిన గులాబీరంగు పురుగుతో పాటు- తలమాడు తెగులు నివారణకు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై గుంటూరులోని లాంఫామ్‌ శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు అందిస్తున్నారు. పొలం గట్లపై పెరిగే వయ్యారి భా (పార్థీనియం) మొక్కలను గుర్తించి పూత రాకముందే వాటిని తొలగించాలి. పొలం లో ఇతర కలుపు మొక్కలను కూడా తొలగించి వాటిని ఎక్కడైనా విసిరివేయ కుండా కాల్చి వేయాలి..1500 పీపీఎం వేపనూనె ఎకరాకు లీటర్‌ చొప్పున పిచికారీ చేస్తే తామరపురుగులు నశిస్తాయి..నత్రజని ఎరువుల వాడకాన్ని పంట సాగు మొదలైన తొలి 80-90 రోజుల తరువాత నిలిపివే యాలి..20 మిల్లీలీటర్ల నీటిలో 1 మిల్లీలీటర్‌ ఇమిడాక్లోప్రిడ్‌ మందును కలిపి కాండానికి పూయాలి..నీలిరంగు జిగురు అట్టలను ఎకరాకు సుమారు 20 పెట్టటం ద్వారా రసం పీల్చే పురుగుల నివారణ సాధ్యపడుతుందని లాంఫాం శాస్త్రవేత్తలు సూచనలు విడుదల చేశారు.

పత్తి కొమ్మల చివరి ఆకులు కొంత మేర పసుపు రంగులోకి వస్తున్నాయంటే తలమాడు తెగులు సోకినట్టు- గుర్తించవచ్చని తెలిపారు. పత్తి ఆకులు పత్ర హరితాన్ని కోల్పోయి ఆకపచ్చ, లేత పసుపు రంగులోకి మారటాన్ని కూడా తెగులుగా భావించాలని వెల్లడించారు. రైతులు అప్రమత్తంగా ఉంటూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే తెగులు ప్రభావాన్ని కనిష్టస్థాయికి తగ్గించవచ్చ ని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement