Monday, April 29, 2024

కాకతీయుల యుద్ధ ప్రేరణ నేటి పేరిణి నృత్యం.. సంప్రదాయ నృత్య కళల అభివృద్ధికి 3255.48 లక్షల కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యుద్ధవిన్యాసాలు నృత్యరూపకాలై, కదంతొక్కే కరవాలాల శబ్దాలు నాట్య భంగిమలై శతాబ్దాల తరబడి తెలంగాణలో జీవం పోసుకున్న పేరిణి నృత్యాన్ని దేశప్రధాని ప్రశంసించడంతో తెలంగాణ కీర్తి బావుట మరోసారి వినీల ఆకాశంలో రెపరెపలాడింది. క్రీ.శ. 10వశతాబ్దం నుంచి 1323 వరకు పాలించిన కాకతీయ రాజుల సేనాలు యుద్ధాలకు సిద్ధమవుతున్న సందర్భంగా ప్రేరణ కోసం నర్తించి పరమశివుని కటాక్షంతో కదనరంగంలో దూకకిన ప్రేరణ నృత్యరీతులే పేరిణిగా సుప్రసిద్ధి.
యోధుల నృత్యంగా వ్యవహరించే పేరిణిని యుద్ధానికి వెళ్లేముందు పరమశివుడి ముందు తాండవం చేసే సంప్రదాయం కాకతీయుల కాలంలో ఉండేది. శరీరాన్ని యుద్ధానికి ఉత్తేజపరిచే ఈ నృత్యానికి లయబద్దంగా సాగే డప్పులమోతలే వాద్యాలు. రామప్పదేవాలయం, వేయిస్తంభాల గుడి, పాలంపేట ఆలయాల్లో పేరిణి నృత్య భంగిమల శిల్పాలు కాకతీయుల వైభవానికి చిహ్నాలుగా నేటికి మిగిలాయి.

ఈ శిల్ప సంపదపై, పేరిణి నృత్య భంగిమలపై అంతర్జాతీయ స్థాయిలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే సుమారు 7 శతాబ్దాలుగా అంతరించిన ఈ నృత్యరూపకాలను పునర్‌ ప్రతిష్టించి పేరిణికి జీవంపోసింది. 1985లో నటరాజ రామకృష్ణ. రామప్ప ఆలయ శిల్పసంపదను పరిశీలించి, అనేక పరిశోధనలు చేసి తిరిగి పేరిణిని సమాజంలోకి తీసుకురాగా తెలంగాణ ప్రభుత్వం పేరిణిని రాష్ట్ర నృత్యంగా ప్రకటించి సంగీత, నృత్య కళాశాలల్లో బోధనాంశంగా తీర్చిదిద్దింది. సాంబ్రాణి దూపంలో మునిగిపోయి డప్పుల శబ్దాల మధ్య వీరాంగంతో ఉత్తేజం పొంది చేసే పేరిణి నృత్యం ప్రేక్షకులను కూడా ఉద్రిక్తులను చేస్తుంది.

- Advertisement -

గణపతిదేవుని పాలనలో యుద్ధవీరుడు, ప్రజ్ఞాశాలి జాయప సేనాని రచించిన నృత్య రత్నావళి పేరిణి నృత్యం గురించి సంపూర్ణ విధానాలను విషదీకరించింది. పేరిణి నృత్య సంప్రదాయం శైవమతానికి సంబంధించింది. పేరిణి ప్రస్తావన పాల్కూరి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోనూ, శ్రీనాథుని కాశీఖండం, భీమఖండంలోనూ, వెంకటగిరి ప్రభువు సర్వజ్ఞకుమార యాచేంద్ర రచనల్లోనూ, నందీశ్వరుని భరతావర్ణవంలోనూ ప్రస్తావించిన యుద్ధనృత్య కళ.

కాకతీయ సామ్రాజ్యంలో శైవం, వీరశైవం విశృంఖలంగా విజృంభించింది. ఆరోజుల్లో పశుపతి సంప్రదాయం వీరశైవం ముమ్మురంగా ప్రచారంలో ఉంది. పశుపతులు, మహేశులు, వీరశైవులు, మైలారదేవుల్లు శివుడి ముందు పేరిణి నృత్యం ప్రదర్శించి భక్తి శ్రద్ధలతో పూజించేవారని చరిత్ర స్పష్టం చేస్తుంది. అయితే యుద్ధాల సందర్భంగా, శైవాలయాల్లో పేరిణి నృత్యాన్ని పురషులు మాత్రమే ప్రదర్శించే వారనడానికి రామప్పఆలయంలోని పేరిణీ భంగిమలు స్పష్టం చేయగా వరంగల్‌ కోట,వేయిస్తంభాల గుడి ముఖమంటపాల్లో కాకతీయ రాజుల సమక్షంలో పేరిణిని ప్రదర్శించేవారని చరిత్ర స్పష్టం చేసింది. అయితే చరిత్రగతిలో బతికి జీర్ణమైన పేరిణి పేరుమాత్రమే మిగలగా నటరాజ రామకృష్ణ పరిశోధించి పరిష్కరించి దానికొక సజీవ రూపకల్పన చేసి పూర్వవైభవాన్ని మనకళ్ల ముందు ఆవిష్కరించి పేరిణి చరిత్ర పుటల్లో ఓ పేజీగా నిలిచారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర నృత్యంగా ప్రకటించి అభివృద్ధికి కృషి చేస్త్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నృత్య కళలు కాపాడుకోవడానికి నిర్వహణ వ్యయంతో పాటుగా రూ.3255.48 లక్షలు కేటాయించి నృత్యం, వారసత్వ కళల పరిరక్షణకు కృషి చేస్తుంది.

యుద్ధరీతుల్లో ఉద్భవించిన నృత్యం..

కాకతీయులు యుద్ధానికి ముందు శైవసంప్రదాయంలో ప్రదర్శించిన ప్రేరణ భంగిమలు పేరిణి నృత్యంగా విరాజిల్లుతుందని పేరిణి నృత్యాన్ని ప్రదర్శించి ప్రధాని మోడీ చేతులమీదుగాఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ అవార్డు తీసుకున్న రాజ్‌ కుమార్‌ నాయక్‌ గురువు పేరిణి కుమార్‌ చెప్పారు. అయితే ప్రభుత్వం రాష్ట్ర నృత్యంగా ప్రకటించినప్పటికీ ఆమేరకు నృత్య కళాకారులకు ప్రోత్సాహం లభించడం లేదన్నారు. పేరిణీ నృత్యం అభ్యసించి రామప్పగుడిలో ప్రదర్శించిన నటరాజ రామకృష్ణ తొలితరం శిష్యుడిగా లభించిన కీర్తి నాకు ఎంతో ఉన్నతమైందన్నారు. నాడు నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యాన్ని పునర్‌ ప్రతిష్టించడానికి కాకతీయుల ఆలయాల శిల్పసంపదను పరిశీలించి నృత్య రూపకాన్ని తీర్చిదిద్దారని తెలిపారు. పేరిణీ నృత్యం తెలంగాణకు గర్వకారణమని భాగవతుల సేతురాం చెప్పారు. కాకతీయుల యుద్ధనీతిలో ఈ నృత్యం ఓ భాగమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement