Thursday, April 25, 2024

తెలుగు రాష్ట్రాల్లో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. తేదీలు ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగు రాష్ట్రాల్లో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే ఉపాధ్యాయుల కోటా, స్థానిక సంస్థల కోటా, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల తేదీలు ప్రకటించగా.. తాజాగా సోమవారం సాయంత్రం ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29తో పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 3 స్థానాలున్నాయి. ఏపీలో పదవీకాలం ముగుస్తున్నవారిలో జాబితాలో నారా లోకేశ్, చల్లా భగీరథ్ రెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పివీవీ సూర్యనారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ నుంచి ఆ జాబితాలో అలిమినేట్ కృష్ణారెడ్డి, వి. గంగాధర్ గౌడ్, కూర్మయ్యగారి నవీన్ కుమార్ ఉన్నారు.

- Advertisement -

ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 14 తేదీలను నిర్ణయించింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా మార్చి 16ను నిర్ణయించగా.. మార్చి 23న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. ఆ రోజు ఉదయం గం. 9.00 నుంచి సాయంత్రం గం. 4.00 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం గం. 5.00 నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement