Monday, April 29, 2024

People March: ప్ర‌జ‌ల కోస‌మే నా పాద‌యాత్ర : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

న‌ల్గొండ : పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నా కోసమో, ఓట్ల కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో చేయడం లేద‌ని, ఈ పాదయాత్ర యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నాన‌ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు కార్నర్ మీటింగ్ లో ఆయ‌న మాట్లాడారు. మండే ఎండల్లో మాకు స్వాగతం పలికిన గుర్రంపోడు ప్రజలకు నమస్కారాలు అన్నారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామ‌ని, పోరాటాలు చేసి సాధించుకున్నామ‌న్నారు. సకల జనుల సమ్మె, విద్యార్థి నాయకులు ఉరికొయ్యలు ఎక్కారు అని, అగ్నికి ఆహుతయ్యారని సోనియమ్మకు చెబితే.. పార్లమెంట్ లో బలం లేకపోయినా అందర్నీ ఒప్పించి మెప్పించి తెలంగాణ ఇచ్చారు అని గుర్తు చేశారు. రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం, నిధులు కోసం, నియామకాల కోసం, దళిత, బహుజన మైనార్టీలకు, చిన్న, సన్నకారు రైతులు తలెత్తకుకుని ఆత్మగౌరవంతో జీవించాలని రాష్ట్రాన్ని సాధించుకున్నాం అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియాకమాలు ఏమీ రాలేద‌న్నారు. వనరులు, సంపద, భూమి ప్రజలకు పంచబడలేద‌న్నారు.

రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు.. ప్రశ్నిస్తే పోలీసుల కేసులు పెడుతున్నార‌ని, రాష్ట్ర ప్రజలు పోలీసులు పడగనీడలో భయంభయంగా బతుకున్నార‌న్నారు. ఆదిలాబాద్ నుంచి గుర్రంపోడు వరకూ వేలాది కిలోమీటర్లు మార్గ మధ్యంలో ప్రజలంతా చెబుతున్న మాట ఇద‌న్నారు. తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు నెరవేర‌కుండా అడ్డంగా నిల‌బడ్డ కేసీఆర్ ను, ఆయన ప్రభుత్వాన్ని ఎత్తి బంగాళాఖాతంలో కలిపేస్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంద‌న్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు, పేదవాళ్లకు ఇచ్చే పింఛన్లు ఆగిపోయాయి. ఇచ్చే పింఛన్ లో ఒకరికి కోసేసి ఒక్కరి మాత్రమే ఇస్తున్నారు. ప్రతి ఏడాది ఇవ్వాల్సిన డీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు నిలిచిపోయాయ‌న్నారు. ఇవన్నీ చూసిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణ ఇచ్చిన లక్ష్యాలు నెరవేరే వరకూ మమ్మల్ని ప్రజల్లో ఉండమని చెబితే.. పాదయాత్రగా వచ్చామ‌న్నారు. ఎండల్లో, వానల్లో సైతం నడుస్తూ ముందుకు నడుస్తున్నామ‌న్నారు. ఇక్కడకు వచ్చేముందు అచ్చంపేట వద్ద నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్బీసీ టన్నెల్ ను ప్రారంభించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయితే గ్రావిటీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు లభిస్తుంద‌న్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఈ టన్నెల్ పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేద‌న్నారు.

నల్లగొండ జిల్లాకు నీళ్లు రాకుండా అడ్డంగా నిలబడ్డ ప్రభుత్వాన్ని, మంత్రులను, ప్రజా ప్రతినిధులను నేను అక్కడే ప్రశ్నించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ ప్రభుత్వం టన్నెల్ పనులు పూర్తి చేయకుండా పదేళ్లుగా మొద్దునిద్ర పోతోంద‌న్నారు. కొత్తగా ఒక్క చుక్క నీళ్లు తీసుకురాని ఇక్కడి మంత్రి గాడిదలు కాస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌డం జ‌రిగింద‌న్నారు. దానికి వాళ్లిచ్చిన సమాధానం నాగార్జున సాగర్ కాలువల నుంచి నీళ్లుస్తున్నామని చెప్పారు. అది లష్కర్ లు చేసే పని మంత్రి చేస్తున్నాడా? అని అడిగితే సమాధానం లేద‌న్నారు. ఇందతకూ ఈయన మంత్రా? లేక లష్కరా? ప్ర‌శ్నించారు. నల్లగొండ ప్రజలకు నీళ్లు రాలేదుకానీ.. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వందల ఎకరాల ఫామ్ హౌస్ లు వచ్చాయి, వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయి, వాళ్ల కుటుంబ ఆస్తులు పెరిగాయి, వాళ్ల కుటుంబాలు మాత్రం బంగారమైనాయ‌న్నారు. కానీ తెలంగాణలోని సామాన్య ప్రజలెవరకీ ఈ ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు. ఈ ప్రాంతంలో కొత్తగా ఒక్కచుక్క నీరు కూడా రాలేద‌న్నారు. మంత్రులుగా ఉండి.. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడం ద్వారానో, డిండి లిప్ట్ కంప్లీట్ చేసి నీళ్ళు ఏమైనా పారించి ఉంటే చెప్పాలని అడిగితే.. సమాధానం చెప్పే ధైర్యం బీఆర్ఎస్ నాయకులకు లేద‌న్నారు. ఇప్పటికీ డిండికి నీళ్లు శ్రీశైలం నుంచి తీసుకురావాలా? లేక మరోచోట నుంచి తీసుకురావాలా అన్న మీమాంసలో పదేళ్లుగా దున్నపోతులా ఈ ప్రభుతం నిద్రపోతే.. నల్లగొండ జిల్లా వాసులను ఎండబెడ్తున్నారు.

దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెబుతున్నాడు.. ప్రతి గ్రామ పంచాయ‌తీకి రూ.20 వేలు ఇస్తామని చెబుతున్నారు.. ఏ ఒక్క కాలువ తవ్వించారని పండుగ చేసుకోవాలి?, ఏ ప్రాజెక్టు కట్టించి నీళ్లు పారించారని పండగ చేసుకోవాలని ప్రశ్నిస్తున్నా అన్నారు. అసలు పండగ చేసుకోవాలంటే నాగార్జున సాగర్ లాంటి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి.. కాలువలు తవ్వించి.. భూములకు నీళ్లు పారించి పంటలు పండేలా చేసి.. నాలుగు ముద్దలు తినేందుకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ నాయకులను గుర్తు చేసుకుని అసలైన పండగ చేసుకోవాలని పిలిపిస్తున్నా అన్నారు. ఈ జిల్లాకు నీళ్లు రాకుండా, ఈ ప్రజలకు ఏమీ చేయకుండా.. మీరు మీ కుటుంబ సభ్యలు ఆస్తులు పెంచుకోవడం కోసమో, లేక ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి.. పోలీస్ స్టేషన్ లో ఉంచినందుకు ఈ రోజు పండగ చేసుకోవాల్సిన అవసరం లేద‌న్నారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ జిల్లానుంచి చాలా ఏళ్లుగా ప్రజా ప్రతినిధిగా ఉన్నాడు.. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ మొదలైంది. ఈ పదేళ్లుగా ఆ టన్నెల్ పురోగతి గురించి, నిధులు గురించి కనీసం మీరు ఇప్పుడున్న పార్టీలో ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి ఏనాడైనా అడిగారా? అంటే సమాధానం లేద‌న్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి ప్రశ్నిస్తే అప్పుడెప్పుడో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏఎమ్మార్ ప్రాజెక్టు విషయంలో రాజీనామా చేస్తానని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించినట్లు చెబుతున్నాడు.. దీనికి నేను ఒక్కటే అడుగుతున్నా.. అప్పుడు చంద్రబాబును బెదిరించినట్లే ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టు నిధులు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికెళ్లి ఎప్పుడైనా అడిగావా? అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు రాక.. నీళ్లురాక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీ ముఖ్యమంత్రి దగ్గరికెళ్లి.. ఎందుకు అడగడం లేదన్నారు. రాజీనామా కాగితాన్ని కేసీఆర్ దగ్గర ఎందుకు పడేయ్యడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను అన్నారు. మా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్.. చూపిస్తూ ఇదిగో ఇక్కడ 60 నుంచి 70 ఎకరాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది. మీరు నడుస్తున్న రోడ్డులో గుంతలు చూసుకుంటూ జాగ్రత్తగా అడుగుస్తున్నారు. అదే అక్కడ ఫామ్ హౌస్ కు డబుల్ రోడ్ ను అద్భుతంగా వేసుకున్నారని చూపించాడు. ఇదీ బీఆర్ఎస్ నాయకులు చేసుకున్న అభివృద్ధి అన్నారు. కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డ వెంకట్ రెడ్డిలాంటి నాయకులు మంత్రులుగా వాళ్లేమీ చేయలేదని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాల‌న్నారు.

- Advertisement -

మా నాయకులు అనేక సంవత్సరాలుగా మంత్రులుగా ఉన్నారు. వీళ్లెవరికి పట్టుమని ఒక్క ఇల్లు కూడా సరిగ్గా లేద‌న్నారు. అక్కడక్కడా కిరాయి ఇండ్లలో ఉంటున్నారు. ఎవరికీ విచ్చలవిడిగా ఫామ్ హౌస్ లేవు అన్నారు. బీఎన్ రెడ్డి, చెకిలం శ్రీనివాస రావు, పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి మహామహులు ఎందరో ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం మహించారు, సాయుధ రైతాంగ పోరాటానికి నాయత్వం వహించారు, దున్నేవాడిదే భూమి అని భూములు పంచిన పెద్దలున్నారు. గతంలో రవీంద్ర నాయక్, చౌహాన్, రాగ్యా నాయక్, పాపయ్య యాదవ్, రాజారత్నం,కొండా లక్ష్మణ్ బాపూజీ వీళ్లంతా ఈ జిల్లానుంచి ప్రాతినిథ్యం వహించి ప్రజల కోసం తపించార‌న్నారు. కానీ ఈ తొమ్మిదేళ్లుగా మరో రకమైన నాయకులు ఈ జిల్లాలో పుట్టార‌న్నారు. జీవితం మొత్తం తెలంగాణ ప్రజల కోసమే అంకితమైనట్లుగా చెప్పుకుని మంత్రి అయిన జగదీశ్వర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డిలు మీ రాజకీయ జీవితం మొదలు పెట్టినప్పుడు మీ ఆస్తులెంత? ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో ఎన్నిరెట్లు ఎలా పెరిగాయి? ప్రజల జీవితాలు ఎదగాలి కానీ.. పాలకుల జీవితాలు కానేకాదు అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కొత్త సంస్క్రుతి ఏర్పడింది. వీళ్ల నాయకుడికి హైదరాబాద్ లో పెద్ద ఫామ్ హౌస్ గడి.. అందులోంచి కేసీఆర్ బయటకు రాడు.. ఆయన్ను చూసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు.. చుట్టూ పెద్ద గడి కట్టుకున్నారన్నారు. ఈ గుర్రంపోడు చెట్టుకింద నిలబడి మంత్రి జగదీశ్వర్ రెడ్డిని, గుత్తా సుఖేందర్ రెడ్డిని నేను అడుగుతున్నా.. ఎందుకు కృష్ణా నది నీళ్లను ఈ నల్లగొండ జిల్లాకు రాకుండా ఎందుకు అడ్డుపడ్డారు? ఎందుక తేలేదు? ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఎందుకు ఇవ్వలేదు. ఒక్కరికి కూడా ప్రభుత్వం ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఒక్క పేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? మీరు చెప్పిన దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నా అన్నారు. వీటికి సమాధానం చెప్పి.. ఆనాటి కాంగ్రెస్ నాయకులకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా అన్నారు. మీలాగ మేము ప్రజాక్షేమం కోసం పనిచేయలేదు, మీలాగ మేయు ప్రజాసేవ చేయలేకపోయాం, మీరు చూపిన మార్గంలో మేము నడవలేకపోయాం.. అని క్షమాపణలు చెప్పి ముక్కు నేలకురాసి.. నల్లగొండ జిల్లాను వదిలేసి బయటకు పోవాల‌న్నారు. తెచ్చుకున్న తెలంగాణ సంపద ప్రజలకే చెందాలి. తెచ్చుకున్న రాష్ట్రంలో క్రుష్ణా, గోదావరి జలాలు మనకు రావాల‌న్నారు. ఈ కార్నర్ మీటింగ్ లో డీసీసీ శంకర్ నాయక్, కుందూరు జయవీర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ చలమల్ల క్రిష్ణారెడ్డి, చలమల్ల రాఘవరెడ్డి, కంఠం జగదీశ్ రడ్డి, చలమల్ల జగదీశ్వర్ రెడ్డి, గణేష్ నాయక్, సర్వయ్య, వెంకటేశ్వర రెడ్డి, సత్యనారాయారణ యాదవ్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement