Saturday, May 18, 2024

రాజగోపాల్ రెడ్డి దారిలో మరికొందరు.. టైమ్​ కోసం వెయిటింగ్​: రఘునందన్ రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం సాధ్యం కాదని తెలంగాణలోని దుబ్బాక ఎమ్మెల్యే (బీజేపీ) రఘునందన్ రావు అన్నారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలను తిప్పికొట్టారు. విలువలకు వలువలకు తేడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకోలేదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారని గుర్తుచేశారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అలా కాదని, ఏ పార్టీ బీ-ఫాం మీదైతే గెలిచారో ఆ పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేస్తున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి, నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని అన్నారు. ఈటల రాజేందర్ సైతం పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే బీజేపీలో చేరారని రఘునందన్ రావు గుర్తుచేశారు. ప్రజాక్షేత్రంలో తలపడి గెలిచి కడిగిన ముత్యంలా బయటికొచ్చారని, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సైతం అదేమాదిరిగా గెలిచి తీరుతారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలుసని, మూటలిచ్చి తెచ్చుకున్న పదవి అని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో జరిగిన సభలకు 3 లక్షల మంది జనం వచ్చారని చెప్పుకున్నారని, కానీ తీరా 3 వేల ఓట్లు కూడా పడలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమని, తెలంగాణ తెలుగుదేశం విషయంలో ఇదే జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ దిశలోనే పయనిస్తోందని రఘునందన్ రావు అన్నారు.

మరోవైపు సోనియా గాంధీపై గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎవరూ మర్చిపోలేదని, తెలంగాణ ప్రజల ప్రాణాలు బలితీసుకున్న బలిదేవత అంటూ ఆరోపించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి బలిదేవత కాస్తా రేవంత్ కాంగ్రెస్‌లో చేరగానే తల్లి తెలంగాణగా ఎలా మారిపోయిందో చెప్పాలని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించే విధానం మానుకోవాలని హితవు పలికారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానం కోసం పోటీపడాల్సి ఉంటుందని అన్నారు. నల్గొండ జిల్లాలో నాలుగు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని తెలిపారు. అక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ-టీఆర్ఎస్ మధ్యనే జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘టచ్‌’లో ఉన్నారు
తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి సైతం పెద్ద సంఖ్యలో నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే చాలా మంది మంతనాలు సాగిస్తున్నారని, ఇంత ముందుగా బయటికొస్తే కేసీఆర్ ఎక్కడ ఇబ్బందిపెడతారో అని ఆలోచిస్తున్నారని తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు సైతం బీజేపీలో చేరాలని చూస్తున్నారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఖాళీ అవడం ఖాయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్) ఇవ్వాలని ఇంతకాలం ఎదురుచూశారని, కానీ ఇప్పుడు సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్ సర్వీస్) ఇవ్వాలని నిర్ణయించుకున్నారని రఘునందన్ రావు అన్నారు. ప్రజలు ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ఎలాంటి భావజాలాలు, కుల సమీకరణాలు లెక్కలోకి రావని అన్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటివేవీ కూడా ప్రభావం చూపే అంశాలు కాదని రఘునందన్ రావు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసిన తర్వాతనే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయని, వాటిలో బీజేపీయే ఎక్కువ రాష్ట్రాల్లో గెలుపొందిందని గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement