Monday, June 17, 2024

భారీ వర్షాలకు ఉత్తర భారతం అల్లకల్లోలం.. వ‌రదనీటితో నదుల ఉగ్రరూపం

న్యూఢిల్లి : ఉత్తర భారత్‌లో పలు రాష్ట్రాల్లో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 14 మంది మరణించారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమైపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. బ్రిడ్జీలు, కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దేశ రాజధాని ఢిల్లి 1982 నాటి నుంచి అత్యధికంగా ఒక్కరోజులోనే 153 మి.మీ.ల వర్షపాతాన్ని నమోదు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్ళు, ఇతర నిర్మాణాలు పెద్ద తిన్నాయి. ఐదుగురు మరణించారు. ఉత్తరాఖండ్‌లో ఒక కారుపై కొండచరియ విరిగిపడింది.

దీంతో కారు గంగా నదిలో కొట్టుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో మెరుపు వరదలకు శనివారం సాయంత్రం ఇద్దరు జవాన్లు వరద నీటిలో కొట్టుకుపోయారు. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వేర్వేరు ఘటనల్లో నలుగురు మరణించారు. చిత్తోడ్‌గఢ్‌లో పిడుగు పడి ఒక పురుషుడు, ఒక మహిళ మరణించగా, సవాయ్‌ మధోపూర్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు వరదనీటిలో గల్లంతైపోయారు.

- Advertisement -

వాయువ్య భారత్‌, యూపీకి భారీ వర్ష సూచన

వర్షాలపై భారత వాతావరణ విభాగం ఆదివారం జారీ చేసిన ఒక బులెటిన్‌లో ”వాయువ్య భారత్‌లో జులై 9, 10 తేదీల్లో పశ్చిమ హిమాలయ ప్రాంతం, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లిd, రాజస్థాన్‌లో ఒక మోస్తరు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయి. జులై 9న ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పొరుగునే ఉన్న పంజాబ్‌, హర్యానా-చండీగఢ్‌కు చెందిన జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. జులై 10 నుంచి 13వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌ అంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి” అని సూచించింది.

హిమాచల్‌ప్రదేశ్‌ అతలాకుతలం

భారీ వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్‌ తల్లడిల్లిపోయింది. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఐదుగురు వ్యక్తులు మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. సివ్లూ జిల్లాలోని కోట్‌గఢ్‌ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక ఇల్లు కుప్పకూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. కుల్లు పట్టణంలో కచ్చా ఇంటిపై కొండచరియ విరిగిపడిన ఘటనలో ఒక మహిళ మరణించింది. చాంబా జిల్లాలో కటియాన్‌ తహసీల్‌లో కొండచరియ విరిగిపడటంతో ఒక వ్యక్తి సజీవసమాధి చెందాడు.

స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ ప్రకారం గడచిన 36 గంటల్లో రాష్ట్రంలో 13 కొండచరియలు విరిగిపడగా, తొమ్మిది మెరుపు వరదలు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయానికి 736 రహదారులు దిగ్బంధానికి గురయ్యాయి. 1,743 ట్రాన్స్‌ఫార్మర్లు, 139 నీటి సరఫరా పథకాలు దెబ్బ తిన్నాయి. 6 మైల్‌ అనే పేరున్న ప్రాంతం వద్ద 21వ నంబరు జాతీయ రహదారి దిగ్బంధానికి గురైంది. ఘోడా ఫామ్‌ సమీపంలో మండి-కుల్లు రోడ్డు దిగ్బంధానికి గురైంది. మనాలీ వద్ద మనాలీ-చండీగఢ్‌ రహదారి కుప్పకూలింది. మనాలీలో దుకాణాలు వరదనీటికి కొట్టుకుపోయాయి. కుల్లు, కిన్నావర్‌, చాంబాలో మెరుపు వరదలకు వాహనాలు కొట్టుకుపోయాయి. పంట పొలాలు నీటమునిగిపోయాయి.

వరదనీటికి పోటెత్తిన నదులు

రావి, బియాస్‌, సట్లెజ్‌, చీనాబ్‌తో పాటుగా అన్ని ప్రధాన నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రయాణాలు మానుకోవాలని, నదీనదాల చెంతకు వెళ్ళరాదని పర్యాటకులు, వాహనచోదకులను అధికారులు హెచ్చరించారు. సివ్లూ జిల్లాలో అనేక రహదారులు మూతపడిపోయాయి. అనేక చోట్ల రైలు పట్టాలపైకి కొండచరియలు, చెట్లు విరిగిపడటంతో యూనెస్కో హెరిటేజ్‌ సివ్లూ, కల్కా ట్రాక్‌ మధ్య అనేక రైళ్ళను రద్దు చేశారు.

చండీగఢ్‌-మనాలీ జాతీయ రహదారి పైన చదోల్‌ సమీపంలో ఒక వాహనంపై కొండరాయి పడిన ఘటనలో నలుగురు పర్యాటకులు వెంట్రుకవాసిలో మృత్యుముఖం నుంచి తప్పించుకున్నారు. కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదల కారణంగా 505వ నంబరు జాతీయ రహదారిపై గ్రంఫు, చోటా ధర్రా మధ్య శనివారం రాత్రి చిక్కుకుపోయిన 30 మంది కళాశాల విద్యార్థులను అధికారులు కాపాడారు. రాష్ట్రంలో ఏడు జిల్లాలకు స్థానిక వాతావరణ విభాగం అధికారులు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసారు. చాంబా, కాంగ్రా, కుల్లు, సివ్లూ, సిర్‌మవుర్‌, మండీ జిల్లాలకు మెరుపు వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

వర్షపాతంలో దేశ రాజధాని రికార్డు

ఆదివారం ఉదయం 8.30 గంటలకు గత 24 గంటల్లో 153 మి.మీ.ల వర్షపాతాన్ని ఢిల్లి నమోదు చేసింది. ఇది 1982 నుంచి జులై మాసంలో ఒక్క రోజులో నమోదైన అత్యధికంగా వర్షపాతంగా నగరంలో ప్రధాన వాతావరణ కేంద్రం ది సఫ్దర్‌జంగ్‌ అబ్జర్వేటరీ రికార్డు చేసింది. 1982 జులై 25న 24 గంటల్లో 169.9 మి.మీ.ల వర్షపాతాన్ని దేశరాజధాని నమోదు చేసుకుందని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం నమోదైన వర్షపాతం 1958 నుంచి జులై మాసంలో అత్యధిక వర్షపాతం నమోదైన మూడవ రోజు అని చెప్పారు.

హస్తిన విలవిల

భారీ వర్షాలకు పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్లు, కడకు ఆసుపత్రి ప్రాంగణాలు ముంపునకు గురికావడంతో రహదారులపై వాహనాల రాకపోకల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. వాహనచోదకులు మోకాల్లోతు వరదనీటిలో వారి వాహనాలను అతికష్టమ్మీద నడుపుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నగర డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యంపై ఆందోళనలను రేకెత్తించాయి. ఈదురు గాలులు, చిరుజల్లులకు నగరంలో అనేక చోట్ల విద్యుత్‌ సరఫరాలో, ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీలో అంతరాయం చోటు చేసుకుంది.

అధికారులకు నో సండే హాలీడే

ప్రభుత్వ అధికారులు సండే హాలిడేను సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రద్దు చేశారు. సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా ఆదేశించారు. నగరంలో సమస్యాత్మక ప్రాంతాలను ఢిల్లి కేబినెట్‌ మంత్రులు, మేయర్‌ షెల్లి ఒబెరాయ్‌ తనిఖీ చేస్తారని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేస్తూ ”నిన్న(శనివారం) ఢిల్లి 126 మి.మీ.ల వర్షపాతాన్ని నమోదు చేసుకుంది. వర్షాకాలంలో మొత్తం వర్షపాతంలో 15 శాతాన్ని ఢిల్లి కేవలం 12 గంటల్లోనే పొందింది. నీటి ముంపు కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు” అని తెలిపారు.

గంగానదిలో పడిన కారు.. ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్‌వాల్‌ జిల్లాలో ఆదివారం ఒక వాహనాన్ని విరిగిపడిన కొండచరియ తాకడంతో సదరు గంగా నదిలో పడటంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని, మరో ముగ్గురు గల్లంతు అయిపోయారని అధికారులు తెలిపారు. వాహనంలో డ్రైవర్‌తో పాటుగా 11 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారిలో ఐదుగురిని కాపాడి రిషికేష్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్టు చెప్పారు. వారంతా రిషికేష్‌ నుంచి కేదార్‌నాథ్‌ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు నదిలో నుంచి మూడు మృతదేహాలను వెలికితీశాయి. బాధితులు ఢిల్లి, బీహార్‌, హైదరాబాద్‌ వాసులని మునికి రేతి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ రితేష్‌ షా తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, నదులు పోటెత్తడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధమీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూపీలో కూలిన

ఇంటికప్పు.. తల్లి, కుమార్తె దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక ఇంటిపై కప్పు కుప్పకూలిన ఘటనలో ఒక మహిళ, ఆమె కుమార్తె మరణించారు. ముజఫర్‌నగర్‌లోని నియాజీపురా ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు స్థానికుల సహాయంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిద్దరి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఇంటియజమానిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. జిల్లాలో శనివారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది.

శనివారం రాత్రి ఇంటి యజమాని అక్షయ్‌ తన భార్య కవిత(27), కుమార్తె మాన్సీతో(7) కలసి ఒక గదిలో నిద్రిస్తుండగా, మిగిలిన కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న గదిలో నిద్రపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంటిపై కప్పు కుప్పకూలిపోయింది. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు తల్లి, కుమార్తెలను ఆసుపత్రికి తరలించగా వారు అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. గాయపడిన అక్షయ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

కశ్మీర్‌కు ఊరట.. తగ్గుముఖం పట్టిన జీలమ్‌ నది ఉధృతి

వాతావరణం మెరుగుపడిన కారణంగా జీలమ్‌ నదిలో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో శ్రీనగర్‌ నగరంతో పాటుగా కశ్మీర్‌లోని లోతట్టుప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఊరట లభించింది. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు ఆదివారం దాకా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వచ్చే 24 గంటల్లో దక్షిణ కశ్మీర్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద ముప్పు తగ్గుముఖం పడుతోందని వాతావరణ అధికారి ఫరూఖ్‌ అహ్మద్‌ భట్‌ తెలిపారు.

వర్షపాతం లోటును పూడ్చిన వర్షాలు

భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకారం జులై మాసంలో మొదటి ఎనిమిది రోజుల్లో దేశంలో అనేక చోట్ల కురిసిన వర్షాలు యావత్‌ దేశంలో వర్షాలు లేని లోటును పూడ్చాయి. ఎనిమిది రోజుల వ్యవధిలో సగటు వర్షపాతం 243.2 మి.మీలకు చేరుకుంది. ఇది 239.1 మి.మీ.ల సాధారణ వర్షపాతం కన్నా 2 శాతం అధికం. అయితే వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతంలో పెద్ద ఎత్తున తేడాలు ఉన్నాయి. తూర్పు, ఈశాన్య ప్రాంతం 17 శాతం లోటును (సాధారణ 454 మి.మీ.ల వర్షపాతానికి బదులుగా 375.3 మి.మీ.ల వర్షపాతం), ఉత్తర భారత్‌ 59 శాతం అదనపు వర్షపాతాన్ని (సాధారణ 125.5 మి.మీ.ల వర్షపాతానికి బదులుగా 199.7 మి.మీ.ల వర్షపాతం), పెద్ద సంఖ్యలో రైతులు వర్షాలపై ఆధారపడే మధ్య భారత్‌లో అదనంగా 4 శాతం వర్షపాతం (సాధారణ 251.1 మి.మీ.ల వర్షపాతానికి బదులుగా 264.9 మి.మీ.ల వర్షపాతం) నమోదైంది. దక్షిణ భారత్‌లో వర్షపాతం లోటు 45 శాతం నుంచి 23 శాతానికి చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement