Friday, May 3, 2024

చేనేత వస్త్రాలు, ముడి వస్తువులపై జీఎస్టీ వద్దు..

చేనేత ఉత్పత్తులు, ముడి సరుకుపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఆ పరిశ్రమ ప్రతినిధులు కోరారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి నివాసంలో ఆమెను కలిసిన ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఛాంబర్స్, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధులు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. చేనేత రంగంపై జీఎస్టీ చూపించే ప్రతికూల ప్రభావం గురించి వారు కేంద్ర మంత్రికి వివరించారు. మిల్లు వస్త్రాల నుంచి చేనేత రంగం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, చేనేతపై పన్ను భారం మోపితే ఆ రంగం తీవ్రంగా దెబ్బతింటుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత మగ్గం, పవర్లూంపై తయారైన కొన్ని చీరలను మంత్రికి చూపించారు. చేనేత వస్త్రాలకు, మిల్లు వస్త్రాలకు ఒకే విధమైన పన్ను సరికాదని వివరించారు.

దేశవ్యాప్తంగా ఉన్న 32 లక్షల చేనేత కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేనేతపై జిఎస్టీ పన్ను తొలగించాలని కోరారు. చేనేత వస్త్రాలకు ఉపయోగించే ముడిపదార్థాలు, తయారైన చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించవద్దన్న విజ్ఞప్తిపై నిర్మల సీతారామన్ సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం చేనేత రంగ ప్రతినిధులు వెల్లడించారు. ఈ అంశాలను కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించినట్టు వెల్లడించారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఛాంబర్స్ అధ్యక్షుడు పద్మశ్రీ గజం అంజయ్య, అఖిల భారత పద్మశాలి సంఘము, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత, జాతీయ అవార్డు గ్రహీత కందగట్ల బాలమణితో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రతినిధులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement