Friday, April 26, 2024

మనకు రష్యా నుంచే అధిక చమురు.. ఆంక్షలున్నా కొనసాగుతున్న దిగుమతులు

మన దేశానికి రష్యా నుంచే అత్యధికంగా చమురు సరఫరా అవుతోంది. వరసగా రెండో నెల నవంబర్‌లోనూ రష్యా మన దేశానికి అతి పెద్ద సరఫరాదారుగా నిలిచింది. ప్రపంచ దేశాల మధ్య చమురు సరఫరా వివరాలను వెల్లడించే వోర్టెక్సా ప్రకారం సౌదీ అరేబియా, ఇరాక్‌ స్థానాలను రష్యా అధిగమించింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతం మాత్రమే ఉంది. అక్టోబర్‌లో రోజుకు 9,35,556 బారెల్స్‌ చమురును భారత్‌కు రష్యా సరఫరా చేసింది . నవంబర్‌లోనూ రోజుకు 9,09,403 బారెల్స్‌ చమురును మన దేశానికి సరఫరా చేసింది. నవంబర్‌ నెలలో మన దేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో 5వ వంతు రష్యా నుంచే వచ్చింది. ఇరాక్‌ నుంచి రోజుకు 8,61,461 బారెల్స్‌, సౌదీ అరేబియా నుంచి 5,70,922 బారెల్స్‌, అమెరికా నుంచి 4,05,525 బారెల్స్‌ చమురు మన దేశానికి దిగుమతి అయ్యింది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ప్రారంభమైన తరువాతే మన దేశానికి రష్యా నుంచి చమురు దిగుమతులు భారీగా పెరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రాయితీ ధరకే చమురు అమ్మేందుకు రష్యా నిర్ణయించింది. దీంతో మన దేశం తక్కువ ధరకే రష్యా నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకుంటోంది. 2021 డిసెంబర్‌లో మన దేశానికి రోజుకు రష్యా నుంచి కేవలం 36,255 బారెల్స్‌ చమురు మాత్రమే వచ్చేది. ఆ సమయంలో ఇరాక్‌ నుంచి 1.05 మిలియన్‌ బారెల్స్‌, సౌదీ అరేబియా నుంచి 9,52,625 బారెల్స్‌ చమురు మన దేశానికి దిగుమతి అయింది.

ఈ సంవత్సరం మార్చిలో మన దేశానికి రష్యా నుంచి రోజుకు 68,600 బారెల్స్‌ చమురు దిగుమతి అయ్యింది. మే నెలలో 2,66,617 బారెల్స్‌కు పెరిగింది. జూన్‌ నాటికి అది 9,42,694 బారెల్స్‌కు పెరిగింది. జూన్‌లో 1,04 మిలియన్‌ బారెల్స్‌తో ఇరాక్‌ అతి పెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. రష్యా రెండో స్థానంలో ఉంది. మన దేశం రష్యా చమురు దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా, దాని మిత్ర పక్షాలు తప్పుపట్టినప్పటికీ మన దేశం దిగుమతులును ఆపలేదు. తమకు తమ దేశ, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. రష్యా చమురు ధరపై నియంత్రణ ఉండాలని అమెరికా, యూరోప్‌ దేశాలు ఆంక్షలు విధించాయి. భారత్‌కు చెందిన చమురు కంపెనీలు రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -

నియంత్రణ ధరలకు బయటే వీటిని కొనుగోలు చెస్తాయని తెలిపింది. దేశ ప్రయోజనాల కోసం మన దేశ కంపెనీలు ఎక్కడ తక్కువ ధరకు చమురు లభించినా కొనుగోలు చేస్తాయని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ ఈ నెల 7న రాజ్యసభలో స్పష్టం చేశారు. ప్రభుత్వం రష్యా నుంచే చమురు కొనుగోలు చేయాలని కంపెనీలకు చెప్పడంలేదని, ఎక్కడ బెస్ట్‌ డీల్‌ ఉంటే అక్కడ కొనుగోలు చేయాలని మాత్రమే తాము చెప్పామని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్‌ యూనియన్‌ రష్యా చమురు కనీసం బారెల్‌కు 60 డాలర్ల కంటే మించి ఉండకూడదని తీర్మానం చేసింది. ఈ మేరకు 27 సభ్య దేశాలను కోరింది. ఈ ధర కంటే రష్యా తక్కువకు అమ్మకూడదని ఈయూ ఆదేశించింది. డిసెంబర్‌ 5 కంటే ముందు డీల్స్‌ దీని పరిధిలోకి రావు. మన దేశం మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement