Friday, May 3, 2024

కొత్త కోర్సులతో కొత్త యూనివర్సిటీ.. ఉపాధి లభించే కోర్సులతో విద్యార్థులకు స్వాగతం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 2022-23 విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ మహిళా యూనివర్సిటీ కొత్త కోర్సులను అందుబాటులోకి తేనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థినులకు కొత్త కోర్సులతో ఆహ్వానం పలకనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్సెస్‌ మరియు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి ఇంజనీరింగ్‌ కోర్సులతో పాటు యూజీ, పీజీ స్థాయిలో ఉపాధి లభించే కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. వీటికి ఆల్‌ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నుంచి అనుమతి పొందేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీలో డీగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు బోధిస్తున్నారు. వీటికి అదనంగా కోర్సు పూర్తి చేసుకున్నాక ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే మరికొన్ని నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈక్రమంలోనే న్యూట్రీషియన్‌ అండ్‌ డైటెటిక్స్‌, సోషల్‌ సైన్సెస్‌ ఇతరత్ర కోర్సులను అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేకాకుండా వికలాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సులను అందిచాలని యోచిస్తున్నారు. కోర్సులు పూర్తి చేసుకున్నవారు సులభంగా ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడేలా కోర్సులను డిజైన్‌ చేస్తున్నట్లు తెలిసింది.

కోఠి మహిళా కళాశాలను తెలంగాణ మహిళా యూనివర్సిటీగా ఇటీవల అప్‌గ్రేడ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమలోనే కోర్సుల రూపకల్పన, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీ తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కోఠి ఉమెన్స్‌ కాలేజీలో మొత్తం 4,500 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ మొత్తం 72 యూజీ, పీజీ ఇతర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదుల సముదాయము, హాస్టళ్లను నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే, ఉమెన్స్‌ కోఠి మహిళా కాలేజీగా తన చివరి స్నాతకోత్సవాన్ని రెండు మూడ్రోజుల్లో నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement