Saturday, April 27, 2024

అమరావతిలో కొత్త లే-అవుట్లు.. జీవో 59కు అనుగుణంగా మరో పదివేల ప్లాట్లు

అమరావతి, ఆంధ్రప్రభ : రాజధాని అమరావతిలో ఆర్‌ -5 జోన్‌తోపాటు కొత్తగా లే-అవుట్లను శరవేగంతో అభివృద్ధి చేస్తున్నారు.. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మరికొన్ని గ్రామాల్లో 268 ఎకరాల భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేసింది. ఈ భూమిలో లేఅవుట్లను సిద్ధం చేసేందుకు అంతర్గత రహదార్లు, మౌలిక వసతుల కల్పనలో భాగంగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కావచ్చిందని సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. జీవో 59 మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్తగా సేకరణ జరిపే ప్రాంతంలో మూడుషిఫ్ట్‌లుగా పనులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా బోరుపాలెంలో 2.05 ఎకరాలు, పిచ్చుకలపాలెంలో 101.56, అనంతవరంలో 64.39 మొత్తంగా 168 ఎకరాలు ఎన్టీఆర్‌ జిల్లాలో నిరుపేదలకు, నెక్కల్లు గ్రామంలో మరో వంద ఎకరాల్లో గుంటూరు జిల్లా లబ్దిదారులకు 10, 890 ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఆర్‌-5 జోన్‌ లో పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటంతో కొత్తగా సేకరణ జరిపిన భూమిలో లేఅవుట్లకు అవసరమైన హద్దురాళ్లకు టెండర్లను ఆహ్వానించారు. ముందుగా ప్లాట్లకు మార్కింగ్‌ ఇచ్చే పనులను ప్రారంభించారు. ఈ పనులను గురువారం సాయంత్రం సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ పరిశీలించారు. ఈ భూములకు జంగిల్‌ క్లియరెన్స్‌ కూడా వచ్చిందని, పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కొత్తగా 268 ఎకరాలు, ఆర్‌-5 జోన్‌తో కలుపుుని మొత్తం 1402.58 ఎకరాల్లో లేఅవుట్ల పనులు జరుగుతున్నాయి. ఇంతకు ముందు నిర్ణయించిన దానికంటే ఎక్కువ మందికి మొత్తం 51వేల 392 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు తొలిదశలో ఎన్టీఆర్‌ జిల్లాకు 583.93 ఎకరాల్లో 11 లేఅవుట్లు, గుంటూరు జిల్లాకు 550.65 ఎకరాల్లో పది లేఅవుట్లలో 40వేల 502 ప్లాట్లను ఇప్పటి వరకు అభివృద్ధి చేశారు.

మిగిలిన పదివేల ప్లాట్లకు సంబంధించిన పనులు ఈనెల 26వ తేదీలోపు పూర్తిచేసి సీఎం జగన్‌ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసేందుకు సీఆర్‌ డీఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.. ప్రభుత్వం ఆర్‌ -5 జోన్‌తో పాటు రాజధానిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడా మాస్టర్‌ ప్లాన్‌లో భూ కేటాయింపులను టచ్‌ చేయకుండా ఇతర ప్రాంతాల్లో భూ సమీకరణ జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాజధానిలో రైతులకు తిరిగి ఇచ్చే రిటర్నబుల్‌ ప్లాట్లు మినహా మిగిలిన ఏ జోన్‌లో అయినా ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసుకునే అధికారం ఉందని వాదిస్తున్నారు. ఆర్‌-5 జోన్‌లో వాణిజ్య అవసరాలకు 6000 ఎకరాలు కేటాయించగా అందులో 900 ఎకరాలు ఆర్‌-5 జోన్‌గా మారిస్తే తప్పేంటని ప్రభుత్వం వాదిస్తోంది.. ఇదిలా ఉండగా ఈనెల 6వ తేదీనే 40 వేల మందికి ఇళ్లస్థలాల కేటాయింపు పూర్తయినట్లు సమాచారం.

- Advertisement -

కాగా ఆర్‌ -5 జోన్‌, జీవో 45పై హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎందుకు నెగ్గలేకపోయామని రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు.. పసలేని వాదనలు వినిపించినందునే సుప్రీంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయా? హైకోర్టులో కూడా ఇదే జరిగిందా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వాదనలకు సరిగా కౌంటర్‌ చేయలేకపోతున్నామా? ఎక్కడుందీ లోపం .. వచ్చే విచారణలో అయినా పటిష్టంగా వాదనలు వినిపించాలనే భావనతో ఉన్నారు. సెంటు భూమి తేడా వస్తేనే ఊరుకోం.. అలాంటిది ఆస్తులన్నీ అప్పగించి దిక్కులు చూడాల్సిన దైన్య స్థితి నెలకొందని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement